Suhas: కామెంట్‌ పెట్టడం నుంచి టికెట్స్‌ కొనే వరకు: సుహాస్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తనకు హ్యాట్రిక్‌ విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నటుడు సుహాస్‌. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Published : 10 Feb 2024 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా నటించి విజయాలు అందుకున్నారు సుహాస్‌ (Suhas). తాను కథానాయకుడిగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band) ఇటీవల విడుదలై, పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెబుతోంది. తాజాగా.. సుహాస్‌ సోషల్‌ మీడియా వేదికగాను వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాని మేం అనుకున్నట్లుగానే ప్రేమతో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. యూట్యూబ్‌లో నా షార్ట్‌ఫిల్మ్స్‌కి కామెంట్స్‌ పెట్టడం నుంచి ఇప్పుడు ‘బుక్‌ మై షో’లో టికెట్స్‌ కొనేవరకు.. నన్ను ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా నా స్థాయి మేరకు మంచి కథలను ఎంపిక చేసుకుని మీ ముందుకు తీసుకురావాలనేదే నా ప్రయత్నం. కలర్‌ ఫొటో, రైటర్‌ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. అలా వచ్చినవే’’

‘‘నేను కథానాయకుడిగా నటించిన ‘ప్రసన్న వదనం’, ‘కేబుల్‌ రెడ్డి’, దిల్‌ రాజు నిర్మాణంలో సందీప్‌ రెడ్డి బండ్ల తెరకెక్కిస్తున్న చిత్రంతో త్వరలో మీ ముందుకురాబోతున్నాను. హ్యాట్రిక్‌ సక్సెస్‌ ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్‌. మరో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకునేందుకు ప్రయత్నిస్తా’’ అని పేర్కొన్నారు. ఆయన నటించిన తొలి సినిమా ‘పడిపడి లేచె మనసు’ (2018). ఇందులో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి, అలరించారు. తర్వాత, ‘మజిలీ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి, ‘కలర్‌ ఫొటో’తో హీరోగా మారారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫొటో’ జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని