Sushanth: యాంకర్‌ తీరుపై సుశాంత్‌ ఆగ్రహం.. వీడియో వైరల్‌

‘‘సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా?’’ అంటూ యాంకర్‌పై ఒకింత అసహనం చేశారు నటుడు సుశాంత్ (Sushanth)‌. మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు వెబ్‌సిరీస్‌లు కూడా చేశానని స్పష్టతనిచ్చారు....

Updated : 15 Jul 2022 13:35 IST

సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా?

హైదరాబాద్‌: ‘‘సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా?’’ అంటూ యాంకర్‌పై అసహనం వ్యక్తం చేశారు నటుడు సుశాంత్ (Sushanth)‌. మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు .. వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తానని స్పష్టతనిచ్చారు. తాను నటించిన కొత్త వెబ్‌సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’లో (Maa Neella Tank) మంచి కంటెంట్‌ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడాలని ఆయన బదులిచ్చారు. ఈ ఘటన ఆ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలో చోటుచేసుకుంది. అయితే, ఇది నిజంగా జరిగింది కాదు.. కేవలం స్కిట్‌లో భాగంగానే చోటుచేసుకుంది.

సుశాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన మొదటి వెబ్‌సిరీస్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’. ‘వరుడు కావలెను’ ఫేమ్‌ లక్ష్మీ సౌజన్య దీన్ని రూపొందించారు. జులై 15 నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఇది అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈ సిరీస్‌ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో సుశాంత్‌, నటుడు సుదర్శన్‌ ఓ సరదా స్కిట్‌ చేశారు. సుశాంత్‌ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తిగా స్టేజ్‌పైకి వచ్చిన సుదర్శన్‌.. ‘‘హీరోయిన్‌ ఉందని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా. హీరో అని చెబితే వచ్చేవాడిని కూడా కాదు. నాకిప్పుడు ఇంటర్వ్యూ చేయాలనే ఆసక్తి లేదు. డబ్బులిచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నా’’ అని అనగానే.. ‘‘వచ్చావు కదా. సరిపెట్టుకుని ఇంటర్వ్యూ చెయ్‌’’ అని సుశాంత్‌ బదులిచ్చారు. అనంతరం ఇది ఎనిమిది ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న వెబ్‌ సిరీస్‌ అని సుశాంత్‌ చెప్పగానే.. ‘‘మనలో మన మాట సినిమాల్లేవా?’’ అని సుదర్శన్‌ ప్రశ్నించడంతో అసహనానికి గురైన సుశాంత్.. ‘‘సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్‌? కంటెంట్‌ ఉందో లేదో సిరీస్‌ చూస్తేనే తెలుస్తుంది’’ అని ఆగ్రహంతో సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని సుశాంత్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని