Anasuya: ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకున్న అనసూయ

‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమాలో నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నటి అనసూయ (Anasuya). తాజాగా జరిగిన ఈసినిమా ప్రెస్‌మీట్‌లో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 22 Mar 2023 10:30 IST

హైదరాబాద్‌: బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ (Anasuya) భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం జరిగిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) ప్రెస్‌మీట్‌లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినిమా ఫైనల్‌ కాపీ చూసి తనకి కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు. ‘‘సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కంగారు పడి తరచూ మా దర్శకుడు కృష్ణవంశీకి కాల్‌ చేసేదాన్ని. సర్‌.. ప్రమోషన్స్‌ ఇంకా మొదలుపెట్టలేదు ఎలా? అని ఆయన్ని అడగ్గా  ‘మన సినిమా మాట్లాడుతుంది’ అని సమాధానం ఇచ్చేవారు. ఈ క్షణం చాలా ఎమోషనల్‌గా ఉంది. ‘రంగమార్తాండ’ వంటి గొప్ప సినిమాలో భాగం అయ్యాను. నా జీవితానికి ఇది చాలు. సోమవారం సాయంత్రం ఈ సినిమా చూశాను. అక్కడే ఆగిపోయాను. సినిమాలో నటించాను కదా.. దీన్ని అంత ఎమోషనల్‌ కానులే అనుకుని ధైర్యం, పొగరుగా వెళ్లి షోలో కూర్చొన్నాను. ఉన్నట్టుండి కన్నీరు ఆగలేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది’’ అని ఆమె అన్నారు.

సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ (Krishna Vamsi) నుంచి వస్తోన్న చిత్రమిది. మరాఠీలో మంచి విజయాన్ని అందుకున్న ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. అంతరించుపోతోన్న నాటకరంగం, దానివల్ల రంగస్థల నటుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే అంశంతో ఇది రూపుదిద్దుకుంది. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించగా.. శివాత్మిక, రాహుల్‌ సిప్లిగంజ్‌, అనసూయ, అలీ రెజా వంటి వారు ముఖ్య భూమికల్లో నటించారు. ఉగాది కానుకగా బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని