Andhra news: ఏపీలో సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

చిత్ర పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది.  సినిమా టికెట్‌ ధరలు పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 Mar 2022 01:14 IST

అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. సినిమా టికెట్‌(Cinema ticket rates) ధరలు పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల రేట్లు కనిష్టంగా రూ.20, గరిష్ఠంగా 250 నిర్ణయించింది. ఏరియాను బట్టి థియేటర్లను నాలుగు రకాలుగా విభజించి ధరలను పెంచింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనం. హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. అయితే, 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త జీవో జారీతో గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 35 రద్దు అయినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

చిత్ర పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు: చిరంజీవి

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రముఖ నటుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేలా థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్‌ రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదో షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం’’ అని ట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని