Avatar 2: ఆ ఓటీటీలోకి ‘అవతార్‌ 2’.. నో రెంట్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌.. ‘అవతార్‌ 2’. అద్దె చెల్లించకుండానే చూసేలా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. ఏ ఓటీటీలో.. ఎప్పుడంటే?

Published : 16 May 2023 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికన పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో సందడి చేసిన ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar: The Way of Water) చిత్రం ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రెంట్‌ చెల్లించకుండానే ఈ సినిమాని సదరు సంస్థ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ విజువల్‌ వండర్‌ని జూన్‌ 7న విడుదల చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పటివరకు వేచి చూడలేమని కొందరు కామెంట్లు పెడితే, ‘వావ్‌’, ‘సర్‌ప్రైజ్‌ అదిరింది’ అని మరికొందరు అంటున్నారు. ఏయే భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదలకానుందన్న విషయాన్ని మాత్రం ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ ఇంకా వెల్లడించలేదు.

హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (james cameron) తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో విడుదలైంది. తొలి భాగం ‘అవతార్‌’లానే పలు రికార్డులు సృష్టించిన ఈ సీక్వెల్‌ 2023 మార్చి 28 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది.

అవతార్‌ 2 కథ ఇదీ..

తొలి చిత్రంలో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్టన్‌) అక్క‌డే ఓ తెగ‌కి చెందిన నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న జేక్ ఆ తెగ‌కి నాయ‌కుడ‌వుతాడు. ప‌దేళ్ల కాలంలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్న జేక్‌, నేతిరి దంపతులు...  ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో బాలుడితో  క‌లిసి హాయిగా జీవిస్తుంటారు. ఇంత‌లో భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని, ఎలాగైనా పండోరాని ఆక్ర‌మించి అక్క‌డున్న నావీ తెగ‌ని అంతం చేయాల‌ని మ‌నుషులు మ‌రోసారి సాయుధ‌బ‌ల‌గాల‌తో దండెత్తుతారు. జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈసారి మెట్క‌యినా ప్రాంతానికి వెళ‌తాడు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కి స‌ముద్ర‌మే ప్ర‌పంచం. మ‌న‌లో స‌ముద్రం, మ‌న చుట్టూ స‌ముద్రం, ఇచ్చేది స‌ముద్ర‌మే.. తీసుకునేది స‌ముద్ర‌మే అని న‌మ్ముతూ నీటిలోనే బ‌తుకుతుంటారు. మెట్కయినా రాజు టోనోవ‌రి స‌హ‌కారంతో జేక్ కుటుంబం సైతం స‌ముద్రంతో అనుబంధం పెంచుకుంటుంది. కష్టమైనా అక్క‌డ జీవించ‌డం నేర్చుకుంటుంది. ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని మ‌ట్టు బెట్టాల‌ని భూమి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన శ‌త్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌), అత‌డి బృందంతో పోరాటం ఎలా సాగించారనేది మిగ‌తా క‌థ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు