Ayalaan Review: రివ్యూ: అయలాన్‌.. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్‌ చేసిన హంగామా మెప్పించిందా?

Ayalaan Review in telugu: శివకార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ ఎలా ఉంది?

Updated : 09 Feb 2024 10:02 IST

Ayalaan Review in telugu; చిత్రం: అయలాన్‌; నటీనటులు: శివకార్తికేయన్‌, వెంకటేష్‌ సెంగుత్తువాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శరద్‌ ఖేల్కర్‌, ఇషా కొప్పికర్‌, కరుణాకరన్‌, యోగిబాబు తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: రూబెన్‌; నిర్మాత: కొట్టపాడి జె.రాజేశ్‌; రచన, దర్శకత్వం: ఆర్‌.రవికుమార్‌; స్ట్రీమింగ్‌ వేదిక: సన్‌నెక్ట్స్‌

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న కథానాయకుడు శివకార్తికేయన్‌. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. సంక్రాంతి కానుకగా ‘అయలాన్‌’ (Ayalaan Movie) అంటూ ప్రేక్షకులను పలకరించడానికి వద్దామనుకున్నా, చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తమిళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో విడుదల కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. మరి  సినిమా ఎలా ఉంది? గ్రహాంతరవాసితో శివకార్తికేయన్‌ చేసిన సందడి ఏంటి?

కథేంటంటే: తామిజ్ (శివ‌కార్తికేయ‌న్‌) సాధారణ రైతు. ప్రకృతికి నష్టం వాటిల్లకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటాడు. లాభాల కన్నా నష్టాలే ఎక్కువ వస్తుంటాయి. ఆశించిన దిగుబడి రాక.. అప్పులు పెరిగిపోవడంతో, తామిజ్‌ను అత‌డి త‌ల్లి (భానుప్రియ‌) ఉద్యోగం చేయాలంటూ సిటీకి పంపిస్తుంది. ఫ్యూయ‌ల్‌కు ప్ర‌త్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను క‌నిపెట్టే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్య‌న్ (శ‌ర‌ద్ ఖేల్క‌ర్‌). గ్యాస్‌ను వెలికి తీయడానికి స్పార్క్ అనే గ్ర‌హ‌శ‌క‌లాన్ని ఉప‌యోగిస్తుంటాడు. ఆఫ్రికాలో అత‌డు చేసిన ప్ర‌యోగం విక‌టించి వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతారు. ఈసారి ఇండియాలో ఎవ‌రికి తెలియ‌కుండా ఓ మైన్‌లో ర‌హ‌స్యంగా ప్ర‌యోగం చేస్తుంటాడు. అత‌డి ద‌గ్గ‌ర ఉన్న స్పార్క్ కోసం వేరే గ్ర‌హం నుంచి టట్టూ అనే ఏలియ‌న్ భూమిపైకి వ‌స్తుంది. (Ayalaan Review in telugu) మరి ఆ ఏలియన్‌ తామిజ్‌ను ఎలా కలిసింది? ఆర్య‌న్ గ్యాంగ్‌తో ఏలియన్‌కు ఏర్పడిన ఇబ్బంది ఏంటి? ఆర్య‌న్ చేసిన ప్ర‌యోగం కార‌ణంగా చెన్నై నగరానికి వచ్చిన ముప్పు ఏంటి?. అన్నది మిగిలిన కథ.

ఎలా ఉందంటే: వెండితెరకు ఏలియన్‌ కథలు కొత్తేమీ కాదు. ఎక్కువగా హాలీవుడ్‌లో దర్శనమిచ్చే ఈ జానర్‌ చిత్రాలు పరిమిత స్థాయిలోనే ఇక్కడ రూపొందాయి. ఇలాంటి వాటికి మన ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్‌ కాకపోవడమే ఇందుకు కారణం. అలాంటి ఏలియన్‌ కథతో ‘అయలాన్‌’ అంటూ సినిమా తీసి, వినోదాన్ని పంచారు దర్శకుడు రవికుమార్‌. ఇప్పటి వరకు వచ్చిన ఇలాంటి చిత్రాలతో పోలిస్తే ఈ మూవీ ఎంటర్‌టైనింగ్‌గా సాగడంతో పాటు, ఆ పాత్రకు మనమూ కనెక్ట్‌ అవుతాం. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ, పైగా తమిళ మూవీ కావడంతో సినిమాలో కాస్త అతి ఎక్కువగానే కనిపిస్తుంది.

తామిజ్‌ వ్యవసాయం చేయడం.. అప్పుల బాధ భరించలేక సిటీకి వెళ్లడం తదితర సన్నివేశాలతో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. రొటీన్‌ మాస్‌ మూవీల్లో ఉండే హీరో ఎంట్రీ సాంగ్‌, డైలాగ్స్‌లను ఇందులోనూ పునరావృతం చేశాడు. దీంతో ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ఏలియన్‌ రాకతో కథలో వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి దానితో హీరో అతని స్నేహితులు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. మరోవైపు నోవా గ్యాస్‌ కోసం ఆర్యన్‌ ప్రయోగాలను చూపిస్తూ కథను నడిపించిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కొంచెం సమయం తీసుకున్నాడు. (Ayalaan Review in telugu) బలమైన ప్రతినాయకుడు ఉన్నప్పుడే హీరో పాత్ర మరింత ఎలివేట్ అవుతుంది. అయితే, ఏలియన్‌ వంటి శక్తిమంతమైన పాత్రను పెట్టుకున్నప్పుడు హీరో పాత్ర తేలిపోతుంది. అది సినిమాలో కనపడకుండా చేసేందుకు దర్శకుడు తెలివైన ట్రిక్‌ను వాడుకున్నాడు. ఏలియన్‌కు శక్తులు ఉండటం, అవి కథానాయకుడికీ బదిలీ అవడం అన్న కాన్సెప్ట్‌ బాలీవుడ్‌లో వచ్చిన ‘కోయి మిల్‌గయా’ తదితర చిత్రాలను గుర్తు తెస్తుంది. సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడంలో మాత్రం ‘అయలాన్‌’ పాసైంది.

ఎవరెలా చేశారంటే:  శివకార్తికేయన్ (Sivakarthikeyan) వన్‌ మ్యాన్‌ షో ఇది. తామిజ్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతడికి ఏలియన్‌ క్యారెక్టర్‌ తోడవడంతో వినోదం మరింత రెట్టింపు అయింది. ఇందులో టట్టూనే సెకండ్ హీరో. ఆ క్యారెక్టర్‌కు అంతటి ప్రాధాన్యం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరణ్ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. నెగెటివ్ పాత్రల్లో ఇషా కొప్పికర్, శరద్ ఖేల్కర్ చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఏఆర్‌ రెహమాన్‌  సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. సాధారణ కథకు ఏలియన్‌ ఎలిమెంట్‌ జోడించి, ‘అయలాన్‌’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు రవి కుమార్‌ విజయం సాధించారు. టట్టూ కనిపించే ప్రతి సన్నివేశంలో వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కుటుంబంతో చూడొచ్చా: ఇది థియేటర్‌ మూవీ. కుటుంబమంతా కలిసి కూర్చొని చూసే చిత్రం. సన్‌నెక్ట్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతం తమిళ్‌ వెర్షన్‌ ఒక్కటే అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్‌ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఈనాడు సినిమా ఓటీటీ సెక్షన్‌ చూడండి.

  • బలాలు
  • + శివకార్తికేయన్‌, టట్టూ
  • + దర్శకత్వం
  • + సాంకేతిక విభాగం పనితీరు
  • బలహీనతలు
  • - అక్కడక్కడ సాగదీతగా సాగే కథనం
  • చివరిగా: ఎంటర్‌టైనింగ్‌ ‘అయలాన్‌’ (Ayalaan Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని