Bedurulanka 2012: ‘సెవెన్ సమురాయ్’లో డైలాగ్‌ స్ఫూర్తితో ‘బెదురులంక 2012’ తీశాం!

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు.

Published : 20 Aug 2023 01:48 IST

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు క్లాక్స్‌ పంచుకున్న విశేషాలు..

మీ అసలు పేరేంటి? ‘క్లాక్స్‌’ అని ఎందుకు పెట్టుకున్నారు!

ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. పదో తరగతి అయ్యాక ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు పలకడం రాకపోతే ఏదో ఒక సౌండ్ చేస్తాం కదా! అలా అలా క్లాక్స్ అనడం మొదలైంది. యాహూ మెసెంజర్‌ స్టార్ట్ అయిన కొత్తల్లో ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశా. నెమ్మదిగా అందరూ అలా పిలవడం మొదలు పెట్టారు.  ఆ తర్వాత Clax అంటే నథింగ్ అని తెలిసింది.

సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?

మాది భీమవరం దగ్గర ఓ పల్లెటూరు. చిత్రసీమలోకి రాకముందు చాలా ఉద్యోగాలు చేశా. డీజేగా కొన్ని రోజులు పని చేశా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా,  క్రెడిట్ కార్డ్స్, సేల్స్‌లో కూడా చేశా. నా రూమ్మేట్స్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు. వాళ్ళతో కథలు డిస్కస్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. అయితే, అనుకోకుండా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే ఇటాలియన్ సినిమా చూశా. అది నాపై చాలా ప్రభావం చూపించింది. సినిమాతో ఇంత ప్రభావం చూపించవచ్చా? అనిపించింది. అమెరికా నుంచి వస్తున్న వాళ్ళతో సినిమాకు సంబంధించిన పుస్తకాలు తెప్పించుకుని చదివా.

ఏయే సినిమాలకు పనిచేశారు?

నా స్నేహితుడు చరణ్ ద్వారా సుధీర్ వర్మ గారు పరిచయమయ్యారు. అప్పుడు ఆయన ‘వీడు తేడా’కి పని చేస్తున్నారు. ఆ సినిమాకు పని చేశా. తర్వాత ‘స్వామి రారా’కు కూడా పని చేశా. టెక్నికల్ విషయాల్లో ఆయన చాలా స్ట్రాంగ్. సుధీర్ వర్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. బుక్స్ ఎక్కువ చదవడం వల్ల ప్రతి సినిమాలో తప్పులు కనిపించేవి. తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆరు నెలలు పనిచేసే అవకాశం లభించింది. సినిమా అనేది సైన్స్ కాదు. దీన్ని రూల్స్ బట్టి చూడకూడదు. ఆర్ట్ / కళగా చూడాలని అర్థమైంది. అప్పుడు నాలో భయం పోయింది. దేవా కట్టా గారు ‘బాహుబలి’ సిరీస్ తీయాలని వర్క్ చేశారు. దానికి కూడా పని చేశా. సుధీర్ వర్మ , దేవా కట్టా సెకండ్ యూనిట్ డైరెక్షన్ ఛాన్సులు ఇచ్చారు. అందువల్ల, ‘బెదురులంక 2012’ ఫస్ట్ డే డైరెక్ట్ చేసేటప్పుడు నాకు ఒత్తిడి ఏమీ అనిపించలేదు.

‘బెదురులంక 2012’ కథను కార్తికేయకు ఎప్పుడు చెప్పారు?

వర్మ గారి దగ్గర పని చేసినప్పుడు నాకు అజయ్ భూపతి పరిచయమయ్యారు. ఆయన ‘కిల్లింగ్ వీరప్పన్’కి పని చేశారు. నేను కథలు చెప్పడం మొదలు పెట్టినప్పుడు... ‘ఆర్ఎక్స్ 100’ షూటింగ్ జరుగుతోంది. అజయ్ భూపతి ద్వారా కార్తికేయ పరిచయం కావడంతో వేరే కథ చెప్పా. ఆయనకు నచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ భారీ విజయం సాధించడంతో ఆయన దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల తర్వాత షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం ఒక సెట్ కు వెళ్ళా. అక్కడ ‘చావు కబురు చల్లగా’ జరుగుతోంది. ‘ఇంకో కథ ఉంది. వింటారా?’ అని కార్తికేయను అడిగితే... ‘ఓకే’ అన్నారు. ఆ తర్వాత కరోనా, నేను రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సినిమా ఆలస్యమైంది.

‘బెదురులంక 2012’ టైటిల్ వెనుక కథేంటి?

సినిమా అంతా ఫిక్షనల్ ఐలాండ్‌లో జరుగుతుంది. మేము ‘ఎదురులంక’ అనే ఓ ఊరిలో షూటింగ్ చేశాం. బోర్డులపై ‘బెదురులంక’ అని రాశాం. చివరకు అదే టైటిల్‌ అయింది. నాకు అకిరా కురసోవా ‘సెవెన్ సమురాయ్’ చాలా ఇష్టం. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ‘రేపు ఉండదని అన్నప్పుడు.. సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం’ ఆ మాట నచ్చింది. ఆ పాయింట్ మీద ఏదో ఒకటి తీయాలని అనుకున్నా. అప్పుడు హాలీవుడ్ సినిమా ‘2012’ వచ్చింది. ఆ రెండిటి స్ఫూర్తితో పల్లెటూరి నేపథ్యంలో కొత్త కథ రాశా. కార్తికేయ, నేహా చాలా బాగా నటించారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూసి, సినిమా టేకింగ్‌ బాగుందని పలువురు మెచ్చుకున్నారు. సెన్సార్‌ సభ్యులు ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. సినిమా బాగుందని కితాబిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని