నేలకొండ భగవంత్‌ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది!

‘భగవంత్‌ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 11 Jun 2023 09:03 IST

‘భగవంత్‌ కేసరి’గా దసరా బరిలో దుమ్ములేపేందుకు సిద్ధమవుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. అర్జున్‌ రాంపాల్‌, శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు’’ అంటూ బాలకృష్ణ చెప్పే శక్తిమంతమైన డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు. ఆయన లుక్‌.. బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్‌ హంగామా.. ప్రతిదీ చాలా కొత్తగా కనిపించాయి. ‘‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్‌ కేసరి. ఈపేరు శానా యేండ్లు యాదుంటది’’ అంటూ టీజర్‌ ఆఖర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘మేము టీజర్‌లో చెప్పినట్లే.. ఈ పేరు శానా యేండ్లు యాదుంటది. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ సినిమాలో బాలయ్య హిందీ డైలాగులు చెబితే థియేటర్లు దద్దరిల్లాయి. తెలంగాణ నేపథ్యం కావడంతో ఇందులోనూ అక్కడక్కడా హిందీ డైలాగులు పెట్టాం. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. తెలుగు సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తార’’న్నారు. ‘‘బాలకృష్ణ చాలా ప్రత్యేకం. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. తనతో కలిసి పని చేయడం గొప్ప ఆనందాన్నిచ్చింది’’ అన్నారు నటుడు అర్జున్‌ రాంపాల్‌. ఈ కార్యక్రమంలో హరీష్‌, సాహు, రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు.

109కి శ్రీకారం..: బాలకృష్ణ 109వ చిత్రాన్ని బాబీ తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. శనివారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి చుక్కపల్లి సురేష్‌ క్లాప్‌ కొట్టగా.. గోపీచంద్‌ మలినేని కెమెరా స్విచ్చాన్‌ చేశారు. త్రివిక్రమ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. వి.వి.వినాయక్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంపై ఉన్న అంశాల్ని బట్టి.. ఇది 1982 నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా చిత్రమని అర్థమవుతోంది. ‘‘ప్రపంచానికి ఇతను తెలుసు. కానీ, ఇతని ప్రపంచం ఎవరికీ తెలియదు’’ అంటూ ఆ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

100రోజుల వేడుక: గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ’వీరసింహా రెడ్డి’ చిత్రం వంద రోజుల వేడుకను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని