Bigg Boss Telugu 5: ఇంత వరకూ బిగ్‌బాస్‌లో కెప్టెన్‌ అవ్వని వారు ఎవరంటే?

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’. ఇప్పటికే 59 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో సరదా సరదాగా సాగిపోతోంది.

Published : 03 Nov 2021 15:31 IST

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’. ఇప్పటికే 59 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో సరదా సరదాగా సాగిపోతోంది. సెప్టెంబరు 5న మొదలైన షోలో మొత్తం 19మంది కంటెస్టెంట్స్‌ వచ్చారు. ఇప్పటివరకూ సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్‌, హమీదా, శ్వేత, ప్రియ, లోబోలు ఎలిమినేట్‌ కాగా, ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 11మంది సభ్యులు ఉన్నారు.

ఇప్పటివరకూ కెప్టెన్‌లు అయింది వీరే!

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ అంటూ ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. కెప్టెన్సీ పోటీదారులకు బిగ్‌బాస్‌ స్పెషల్‌ టాస్క్‌లు ఇచ్చాడు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్‌ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుడిలో నెలకొంది. ఎందుకంటే షో మొదలై దాదాపు 60 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకూ అసలు కెప్టెన్‌ కాని సభ్యులు కూడా హౌస్‌లో ఉన్నారు. సిరి మొదటి వారమే కెప్టెన్‌ కాగా, రేషన్‌ మేనేజర్‌గా విశ్వ వ్యవహరించాడు. ఆ తర్వాత వరుసగా విశ్వ, జస్వంత్‌, శ్రీరామచంద్ర, ప్రియ, విశ్వ, సన్నీ, షణ్ముఖ్‌లు కెప్టెన్‌లు అయ్యారు. వీరిలో విశ్వ రెండుసార్లు కెప్టెన్‌ కావడం గమనార్హం.

వీళ్లలో ఎవరైనా అవుతారా?

ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో రవి, మానస్‌, ప్రియాంక, అనీ మాస్టర్‌, కాజల్‌ కెప్టెన్సీ పోటీదారులుగా తుది వరకూ పోరాడినా వీరిని అదృష్టం వరించలేదు. ఈ వారం వీరిలో ఎవరైనా కెప్టెన్‌ అవుతారా? లేక ఇప్పటికే అయిన వాళ్ల నుంచి కెప్టెన్‌గా ఎంపికవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌ అయిన వారికి ఇమ్యూనిటీ పవర్‌ లభిస్తుంది. తదుపరి వారం వారిని నామినేట్‌ చేసే వీలుండదు. దీంతో ఇంటి సభ్యులు కెప్టెన్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. గెలిచేందుకు ఎవరి స్ట్రాటజీలు వాళ్లు ఉపయోగిస్తారు. ఇక మాటల యుద్ధం సరేసరి. ‘గ్రూపులుగా ఆడినంతకాలం నేను హౌస్‌ ఉండగా కెప్టెన్‌ అవ్వను’ అంటూ అనీ మాస్టర్‌ ఇటీవల వాయిపోయింది. గతవారం మానస్‌ కూడా కెప్టెన్‌ కావాల్సింది. థర్మాకోల్‌ బాల్స్‌ టాస్క్‌లో శ్రీరామ్‌చంద్రతో పోటీ పడి మానస్‌ గేమ్‌ తప్పుకొన్నాడు. ఈ రోజు ఆడే గేమ్‌ను బట్టి ఇంటి కెప్టెన్‌ ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి చూస్తే, శ్రీరామ చంద్ర, రవిలు ప్రత్యేక టాస్క్‌లు తీసుకున్నారు. ఇద్దరూ గట్టి పోటీదారులే. వీరితో పాటు ఇంకెవరైనా పోటీలో ఉన్నారా? లేదా తెలియాల్సి ఉంది.

ఇప్పటివరకూ వరెస్ట్‌ పెర్ఫార్మర్స్‌ వీరే!

మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ పూర్తి కాగానే, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఉంటుంది. ఆపై వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ను ఎంచుకుంటారు. ఇప్పటివరకూ 8మంది వరెస్ట్‌ పెర్ఫార్మర్స్‌గా ఎంపికయ్యారు. రెండు సార్లు, జెస్సీ, సన్నీలు ఎంపికవడం విశేషం. వీరు కాకుండా మానస్‌, కాజల్‌, శ్వేత, విశ్వలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని