Sanjay Dutt: ‘కేజీయఫ్‌’లో విలన్‌.. వాస్తవంలో హీరో!

కొన్ని కీలక పాత్రలు ఎవరి దగ్గరకు చేరాలో వారిని వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, వివిధ కారణాల వల్ల వదులుకునేవారు మరికొందరు. ‘కేజీయఫ్‌ 2’లోని ప్రధాన విలన్‌ పాత్ర ‘అధీరా’ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ను కోరింది.

Published : 14 Apr 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని కీలక పాత్రలు ఎవరి దగ్గరకు చేరాలో వారినే వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు కొందరైతే, వివిధ కారణాల వల్ల వదులుకునేవారు మరికొందరు. ‘కేజీయఫ్‌ 2’లోని ప్రధాన విలన్‌ పాత్ర ‘అధీరా’ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్‌ను కోరుకుంది. చాలా ఆసక్తికర క్యారెక్టర్‌ కావడంతో ఆయన ఓకే చెప్పారు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? దాని వెనక విశేషం కాదు ఓ పోరాటమే దాగుంది.

క్యాన్సర్‌ను జయించి..

సంజయ్‌కు గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 60 (సుమారు) ఏళ్ల వయసులో ఆ మహమ్మారి వ్యాధిపై అలుపెరగని పోరాటం చేసి జయించారు. కొన్నాళ్లు విశ్రాంతి అనంతరం, కోలుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చే క్రమంలో ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’సహా మరికొన్ని కథలు ఆయన దగ్గరకు చేరాయి. ‘విలన్‌ పాత్ర.. పోరాటాలు చేయాలి. ఇప్పుడు ఇలాంటి పాత్రలు అవసరమా’ అనే సందేహాలు పెట్టుకోకుండా తన మార్క్‌ వైవిధ్య నటనను ప్రేక్షకులకు మరోసారి చూపించేందుకు అధీరా పాత్రకు ఆయన సై అన్నారు. ఈ భయంకర వ్యాధిపై గెలిచిన తర్వాత ఆయన నటించిన తొలి చిత్రమిదే. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సహజం. వాటిని అధిమగమిస్తూ ఎండావానా, పగలురాత్రీ లెక్క చేయకుండా నటించిన సంజయ్‌ చిత్ర బృందాన్ని ఆశ్యర్యానికి గురిచేశారు. మరో విశేషం ఏంటంటే సెట్స్‌లో అడుగుపెట్టిన తొలిరోజే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన పాల్గొన్నారు. సంజయ్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సంబంధిత సన్నివేశాలు గ్రీన్‌మ్యాట్‌పై చిత్రీకరించాలని ప్రతిపాదించినా వినకుండా సహజంగానే నటించారు. ఆ సినిమా నటీనటులకు, సాంకేతిక బృందానికి స్ఫూర్తిగా నిలిచారు. ‘రియల్‌ హీరో’ అనిపించుకున్నారు.

పోరాట యోధుడిగా..

సంజయ్‌ విషయంలో ‘‘ఆశ క్యాన్సర్‌ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది.. భయం అల్సర్‌ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది’’ అనే సినిమా డైలాగ్‌ సరిగ్గా సరిపోతుంది. వ్యాధి నాలుగో దశకు చేరినా ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా తనను తాను నమ్మి ముందుకుసాగారు. ఓవైపు చికిత్స పొందుతూనే ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేసి త్వరగా రికవరీ అయ్యారు. క్రమం తప్పకుండా సంజయ్‌ చేసిన కసరత్తులను చూసి ఆయనకు వైద్యం అందించిన వారే షాక్‌ అయ్యారట.

అధీరా ఇలా సాధ్యమైంది

‘‘క్యాన్సర్‌ను ఓ సవాలుగా స్వీకరించి, విజయం అందుకున్నా. ఆ ప్రయాణం నాకెంతో నచ్చింది. దాన్నుంచి కోలుకున్న తర్వాత ఓ పద్ధతి ప్రకారం జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నా భార్య మాన్యతాదత్‌, పిల్లలు నా వెన్నంటే ఉండి ఎంతో ధైర్యాన్నిచ్చారు. నా భార్య తర్వాత అంతగా నాలో స్ఫూర్తినింపింది నా పిల్లలే. కేజీయఫ్‌.. టీమ్‌ నాకెంతో సహకారం అందించింది. ముఖ్యంగా ప్రశాంత్‌ నీల్‌ చాలా కంఫర్ట్‌గా చూసుకున్నారు. వీరందరి వల్లే నేను ‘అధీరా’ అయ్యా’’ అని సంజయ్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. కథానాయకుడిగా అయినా ప్రతినాయకుడిగా అయినా సంజయ్‌ తెరపై కనిపిస్తే భారతీయ సినిమా అభిమానులకు పండగే. ఆ పండగ వాతావరణం మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. ‘అధీరా’గా సంజయ్‌ నటించిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్ 2’ గురువారం విడుదలకానుంది. యశ్‌ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రమిది. సంజయ్‌ ప్రస్తుతం.. ‘ఘడ్‌చది’, ‘తులసీదాస్‌ జూనియర్‌’ తదితర హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని