Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగమార్తాండ’ (Rangamarthanda). తాజాగా ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో బ్రహ్మానందం మాట్లాడారు.

Updated : 21 Mar 2023 16:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఈ సినిమా ఉగాది కానుకగా రేపు (మార్చి 22) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడారు.  తాను చనిపోయేవరకూ కమెడియన్‌గానే అలరిస్తుంటానని చెప్పారు.  కామెడీ బ్రాండెడ్‌ బ్రహ్మానందంగా ఉండడానికే తాను ఇష్టపడతానని తెలిపారు.

‘‘బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపిస్తే, నవ్వడం అనేది కామన్‌ పాయింట్‌ అయిన రోజుల్లో కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌ కలిసి మా ఇంటికి వచ్చారు. ఎవరైనా సరే నేల విడిచి సాము చేయకూడదు. నేను ఎన్ని వందల సినిమాలు చేసినా, ఎంత బాగా నవ్వించినా, నేను ఎప్పటికీ కమెడియన్‌నే. ఆ పరిధి దాటి నేను రాకూడదు. వచ్చినా చూడరు. సీరియస్‌గా నటించినా నవ్వే రోజులివి. అలాంటి పరిస్థితుల్లో జాతీయ అవార్డు అందుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ఒక పాత్ర గురించి చెబుతున్నారంటే నేను షాకయ్యా. ఇదొక అరుదైన అవకాశమని నేను ఫీలయ్యా. ఒక రోజు ప్రకాశ్‌రాజ్‌ ఫోన్‌ చేసి, ‘అన్నయ్యా.. ఈ రోజు మీరు బాగా నటించారు. ఇప్పుడు మిమ్మల్ని అభినందించకుండా ఉంటే, ఆ కళామతల్లికి ద్రోహం చేసినట్లే’ అని అన్నాడు. ప్రకాశ్‌రాజ్‌ అంతటి నటుడు నేను తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే ‘మీరు బాగా చేశార’ని చెప్పొచ్చు. కానీ, ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించటం మామూలు విషయం కాదు. కృష్ణవంశీ కూడా అంతే. ఒక రోజు భోజనం కూడా తినే సమయం ఇవ్వకుండా ఒక పెద్ద సీన్‌ సింగిల్‌ టేక్‌లో చేయాలని చెప్పాడు. ‘బ్రహ్మానందానికి ఈ పాత్ర ఇచ్చి కృష్ణవంశీ చెడగొట్టాడు’ అని జనం ఎక్కడ అంటారేమోనని నా భయం. దాంతోనే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా. ప్రకాశ్‌రాజ్‌ నటిస్తుంటే, ఒక్కోసారి సాధారణ ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయేవాడిని. మళ్లీ తేరుకుని షాట్‌లోకి వచ్చేవాడిని. ఏది ఎంతవరకూ కావాలో కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌లకు బాగా తెలుసు. ప్రతి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ వీళ్లను చూసి నేర్చుకోవాలి. ఇందులో ఎలాంటి టెక్నికల్‌ షాట్స్‌ ఉండవు. జీవితాన్ని చూసినట్లు ఉంటుంది.’’ అని బ్రహ్మానందం అన్నారు.

ఇక తాజాగా విడుదలైన ‘రంగమార్తాండ’ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో బ్రహ్మానందం తన నట విశ్వరూపాన్ని చూపారు. ‘ఒంటరి జననం.. ఏకాకి మరణం’ వంటి డైలాగులతో కంటతడి పెట్టించారు. ఎమోషన్స్‌తో నిండిపోయిన ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ (Ramya Krishna), ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ప్రధానపాత్రల్లో నటించారు. మరాఠీ భాషలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘నటసామ్రాట్‌’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని