butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ

butta bomma review: అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ కీలక పాత్రల్లో నటించిన బుట్టబొమ్మ ఎలా ఉందంటే?

Updated : 04 Feb 2023 14:20 IST

butta bomma review: చిత్రం: బుట్టబొమ్మ; నటీనటులు: అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ, ప్రేమ్‌ సాగర్‌, నర్రా శ్రీను, జగదీష్‌, పమ్మి సాయి, కిరణ్‌ తదితరులు; సంగీతం: గోపీ సుందర్‌, స్వీకర్‌ అగస్తి; కూర్పు: నవీన్‌ నూలి; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: గణేష్‌ కుమార్‌ రావూరి; ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు; దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్‌ టి.రమేష్‌; నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య; విడుదల తేదీ: 04-02-2023

ఒకవైపు పెద్ద సినిమాలతో జోరు చూపిస్తూనే.. మరోవైపు చిన్న చిత్రాలతోనూ వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. గత ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’ వంటి చిన్న సినిమాతో బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించిన ఈ నిర్మాణ సంస్థ ఈసారి ‘బుట్టబొమ్మ’ (butta bomma review) తో బరిలోకి దిగింది. మలయాళంలో విజయవంతమైన ‘కప్పెల’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. అనిక సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటం.. దీని నిర్మాణంలో త్రివిక్రమ్‌ సొంత నిర్మాణ సంస్థ కూడా భాగమవ్వడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం తెరపై ఎలా కనువిందు చేసింది? (butta bomma telugu movie review) ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది?

కథేంటంటే: అరకు ప్రకృతి అందాల మధ్య ఉన్న దూది కొండకు చెందిన ఓ మామూలు మధ్యతరగతి అమ్మాయి సత్య (అనిక సురేంద్రన్‌). ఆమెది చాలా సింపుల్‌ లైఫ్‌. టైలరింగ్‌ చేసుకునే తల్లి, రైసు మిల్లులో పని చేసే తండ్రి, స్కూల్‌కు వెళ్లే ఓ చెల్లి, ఇష్టంగా పూజించే కృష్ణుడు, ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం తపన పడే ఓ డబ్బున్న కుర్రాడు.. సత్య జీవితంలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు వీళ్లే. ఓ కెమెరా ఫోన్‌ కొనుక్కోని.. రీల్స్‌ చేసి ఫేమస్‌ అవ్వాలన్నది ఆమె కల. కానీ, ఓ రాంగ్‌ నంబర్‌ సత్య జీవితాన్ని మార్చేస్తుంది. కనీసం ఒక్కసారైనా చూడకుండానే ఫోన్‌లో పరిచయమైన మురళి (సూర్య వశిష్ఠ)ని ప్రేమిస్తుంది. తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం చేయడంతో.. చెప్పాపెట్టకుండా మురళిని కలవడం కోసం విశాఖపట్నంకు వెళ్తుంది. కానీ, ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. మరి మురళిని కలవడం కోసంవైజాగ్‌ వెళ్లిన సత్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? (butta bomma review)  ఈ జంటను ఆర్కే (అర్జున్‌ దాస్‌) ఫాలో చేయడానికి కారణమేంటి? అతను ఎవరు.. చివరికి ఏం చేశాడు? అన్నవి తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: ఆడపిల్లల పట్ల జరిగే మోసాలు, అకృత్యాలపై రోజూ రకరకాల వార్తలు చూస్తుంటాం. అలాంటి వార్తల్లో నుంచి పుట్టిన ఓ కథే ఈ ‘బుట్టబొమ్మ’. ప్రధమార్ధమంతా ఆహ్లాదభరితమైన ప్రేమకథలా సాగితే.. ద్వితీయార్ధం నుంచి అది థ్రిల్లర్‌ జానర్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. అయితే కథ ఏ జానర్‌లో సాగినా దాన్ని ఆసక్తికరంగా పరుగులు పెట్టిస్తేనే ప్రేక్షకుల్ని కుదురుగా కుర్చీల్లో కూర్చోబెట్టగలుగుతాం. ఈ విషయంలో చిత్ర దర్శకుడు రమేష్‌ తడబడ్డాడు. ఈ చిత్రానికి ప్రధాన లోపం కథనంలో ఆ వేగం కనిపించకపోవడమే. సత్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ.. కథను ప్రారంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అలాగే మురళి పాత్ర.. అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. (butta bomma review) ఓ రాంగ్‌ కాల్‌తో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడ్డాకే అసలు కథ మొదలవుతుంది. నిజానికి ఇలా ముఖాలు చూసుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమలో పడటమన్న పాయింట్‌ను తెలుగు తెరపై ఇప్పటికే బోలెడన్ని సార్లు చూశాం. కాబట్టి ఇలాంటి లవ్‌ ట్రాక్‌ను మళ్లీ తెరపై చూపించాలంటే ఓ కొత్త మ్యాజిక్‌ ఏదో చేయాలి. ఆయా ప్రేమ సన్నివేశాల్ని సరికొత్తగా, ఆసక్తికరంగా అల్లుకోవాలి. కానీ, అలాంటి ప్రయత్నమేదీ ఈ చిత్రంలో కనిపించలేదు. పొడుపు కథలకు సమాధానాలు చెప్పాడని సత్య.. గొంతు బాగుందని మురళి ప్రేమలో పడటమన్నది అంతగా ఆకట్టుకోదు. సత్య స్నేహితురాలి లవ్‌ ట్రాక్‌ నుంచి వినోదం రాబట్టాలని ప్రయత్నించినా.. అది వర్కవుట్‌ కాలేదు. (butta bomma review) సత్యకు ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయం చేయడం.. మురళిని కలవడం కోసం ఆమె వైజాగ్‌కు వెళ్లడం.. అక్కడ కొందరు ఆమెను ఫాలో చెయ్యడం.. ఇలా విరామానికి ముందు సినిమా ఒక్కసారిగా థ్రిల్లర్‌ జానర్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. సత్య - మురళిల కథలోకి అర్జున్‌ పాత్ర ప్రవేశించాక కథలో ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. నెగిటివ్‌ షేడ్‌ టచ్‌తో ఆర్కే పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు బాగుంది. పతాక సన్నివేశాలకు ముందు మురళి పాత్రలో వచ్చే మార్పు, ఆర్కే పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో చెప్పిన సందేశం ఆలోచింపజేసినా.. సినిమాని ముగించిన తీరు అంతగా సంతృప్తినివ్వదు.

ఎవరెలా చేశారంటే: సత్య పాత్రకు అనిక చక్కగా కుదిరింది. టైటిల్‌కు తగ్గట్లుగానే తెరపై అందమైన పల్లెటూరి బుట్టబొమ్మలా(butta bomma review)   కనిపించింది. తన వయసుకు తగ్గ పాత్ర కావడంతో నటన విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. రెండు కోణాల్లో సాగే మురళి పాత్రకు సూర్య వశిష్ఠ చక్కగా న్యాయం చేశారు. తొలి చిత్రమైనా మంచి నటనను కనబర్చాడు. ఆర్కే పాత్రలో అర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆ పాత్రకు ఆయన్ని తీసుకోవడం సరైన్‌ ఎంపిక. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. రెండు ట్విస్ట్‌లను ఆధారం చేసుకొని రాసుకున్న కథ ఇది. ఆ ట్విస్ట్‌లు బాగున్నా.. కథ ఆద్యంతం చాలా చప్పగా సాగుతుంది. మాతృకను చూసిన వాళ్లకు ఇదేం కొత్తగా అనిపించదు. పాయింట్‌ చాలా చిన్నది కావడంతో.. చాలా చోట్ల కథ సాగతీసినట్లుగా ఉంటుంది. (butta bomma review)  గణేష్‌ రావూరి సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. పాటలు వినసొంపుగా ఉన్నా.. ఏదీ గుర్తుంచుకునేలా ఉండదు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం కథకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు: + కథా నేపథ్యం; + కథలోని మలుపులు, + ద్వితీయార్ధం

బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం; - ఫీల్‌ లేని లవ్‌ ట్రాక్‌

చివరిగా: అక్కడక్కడా మెప్పించే ‘బుట్టబొమ్మ’ (butta bomma review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని