Dhanya balakrishna: నన్ను నమ్మండి అవి నా మాటలు కావు.. ధన్య బాలకృష్ణ క్షమాపణలు

‘లాల్‌ సలాం’ చిత్రబృందానికి, తమిళ ప్రజలకు నటి ధన్య బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.

Published : 02 Feb 2024 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ధన్య బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ‘లాల్‌ సలాం’ (Lal Salaam) చిత్ర బృందానికి, తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ‘లాల్ సలాం’ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం తర్వాత గతంలో ధన్య తమిళనాడునుద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌ పెట్టారని ఒక స్క్రీన్‌షాట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో కొందరు నెటిజన్లు ‘ఆమె నటించిన కారణంగా మేము సినిమా చూడం’ అంటూ కామెంట్స్‌ చేశారు. గత రెండు రోజులుగా ఈ వ్యవహారం ఎక్స్‌ (ట్విటర్‌)లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై ధన్య (Dhanya balakrishna) స్పందించారు.

‘నేను తమిళనాడును ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఒక స్క్రీన్‌ షాట్‌ వైరలవుతోంది. అది నేను పెట్టింది కాదు. ఎవరో ఎడిట్‌ చేశారు. ఈ విషయాన్ని నాకు తిండి పెడుతోన్న సినీ పరిశ్రమపై ప్రమాణం చేసి చెబుతున్నాను. కొందరు నన్ను ట్రోల్‌ చేయడం కోసం దాన్ని సృష్టించారు. ఈ విషయాన్ని 12 ఏళ్ల క్రితమే నేను స్పష్టంచేశాను. ఇప్పుడూ అదే విషయం చెబుతున్నాను. ఇన్నేళ్లుగా దీనిపై నేను మౌనంగా ఉండడానికి చాలా కారణాలున్నాయి. నా కుటుంబాన్ని కొందరు బెదిరించారు. వాళ్లను కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి నేను దీనిపై నేను పెదవి విప్పలేదు’

తొలి సినిమా ఫ్లాప్‌.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్‌ కెరీర్‌ To పొలిటికల్‌ ఎంట్రీ.. విజయ్‌ లైఫ్‌ జర్నీ ఇదే!

‘తమిళ సినిమాతోనే నా కెరీర్‌ ప్రారంభించాను. ఇక్కడ నాకు ఎంతోమంది స్నేహితులున్నారు. అందుకే ఈ రాష్ట్రం గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. కోలీవుడ్‌లో నాకున్న అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది. ఒక నటిగా, స్త్రీగా ఎవరినీ నొప్పించేలా మాట్లాడాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. తమిళంలో నేను మూడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేశాను. ఇప్పటివరకు ఎక్కడా ఆ పోస్ట్‌ ప్రస్తావన రాలేదు. అందులో ఉన్నది నా మాటలు కానప్పటికీ నేను క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తమిళ ప్రజలు ఆ స్క్రీన్‌ షాట్‌ వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి’ అని కోరారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల అసౌకర్యం కలిగినందుకు హీరో రజనీకాంత్‌కు, దర్శకురాలు ఐశ్వర్యకు కూడా ధన్య సారీ చెప్పారు. ఆ స్క్రీన్‌ షాట్‌లో ఉన్నది తన మాటలు కాదని నిరూపించేందుకు తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

‘లాల్‌ సలాం’ విషయానికొస్తే.. క్రికెట్‌ చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించగా.. రజనీకాంత్‌ (Rajinikanth)కీలకపాత్ర పోషించారు. దీన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని