Dil Raju: నా తప్పుంటే బహిరంగంగా క్షమాపణ చెబుతా: దిల్‌ రాజు

నిర్మాతగా 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు దిల్‌రాజు (Dil Raju). ఈ ప్రయాణంలో తాను ఎన్నో సవాళ్లు చూశానని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనపై వస్తోన్న ట్రోల్స్‌పై స్పందించారు.

Updated : 06 Apr 2023 11:34 IST

హైదరాబాద్‌: సోషల్‌మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌, నెగెటివిటీపై స్పందించారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju). నిర్మాతగా ౨౦ ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తాను ఎన్నో జయాపజయాలు చూశానని అన్నారు. ఒక సాధారణ నిర్మాత నుంచి ఇప్పుడు పాన్‌ ఇండియాలో స్థాయి పేరు పొందిన ప్రొడ్యూసర్‌ని అయ్యానని చెప్పిన ఆయన.. సక్సెస్‌తోపాటే సమస్యలు కూడా పెరుగుతాయన్నారు. మొదట్లో ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకునే వాడిని కాదని.. కాకపోతే, గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తిగతంగా నష్టపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే తాను స్పందిస్తున్నానని అన్నారు. తన తప్పుంటే బహిరంగ క్షమాపణ చెబుతానని అన్నారు.

ఆ ఒక్కరోజే బాధపడతా..!

‘‘ఎక్కడో జీరో నుంచి మొదలైన నేను భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ స్థాయికి వచ్చానంటే.. దీనిని గ్రేట్‌ జర్నీగానే భావిస్తాను. సక్సెస్‌తోపాటు సమస్యలు కూడా పెరగడం సహజం. శత్రువులూ మొదలవుతారు. మనం ఏం మాట్లాడినా మరో విధంగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తారు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని నేను పట్టించుకోను. ప్రతిసారీ ఆత్మపరిశీలన చేసుకుంటా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తా. సినిమా అనేది వేరు. కానీ, ఒక మనిషిగా నా వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకుంటా. ఫెయిల్యూర్‌ వచ్చిన తర్వాత మళ్లీ సక్సెస్‌ ఎలా సాధించాలి? అనే అంశంపైనే దృష్టి పెడతా. నేను ఎప్పుడూ సక్సెస్‌ వెనుకే పరిగెడతా. ఏదైనా ఫెయిల్యూర్‌ వచ్చినా ఆ ఒక్క శుక్రవారం మాత్రమే ఆలోచిస్తా. కాస్త బాధపడతా. ఆ తర్వాత రోజు నుంచి వచ్చే శుక్రవారంపై ఫోకస్‌ పెడతా’’

క్షమాపణ చెబుతా..!

‘‘అదృష్టవశాత్తు నేను సోషల్‌మీడియాలో లేను. సామాజిక మాధ్యమాల్లో ఉండటం నాకంత నచ్చదు. కాకపోతే, గడిచిన ఏడాదిగా నా టీమ్‌ సభ్యులు కలిసినప్పుడల్లా  సోషల్‌మీడియాలో నాపై వచ్చే విమర్శల గురించి చెబుతుండేవారు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ఎవరో ఏదో మాట్లాడుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేవాడిని. ఏ విషయంలోనైనా తప్పు చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తా. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే, వేరొకరిని ఇబ్బందిపెట్టేలా నేను వ్యాఖ్యలు చేస్తే బహిరంగంగా క్షమాపణ కోరడానికి కూడా సిద్ధంగా ఉంటా. అయితే, ఈ మధ్యకాలంలో కొంతమంది కావాలని పర్సనల్‌ డ్యామేజ్‌కు ప్రయత్నిస్తున్నారు. నేను ప్రతి చోటా ఉంటున్నాను కాబట్టే ఇంతటి నెగెటివిటీ. కేవలం నిర్మాతగానే ఉంటే ఇంత ఉండేది కాదు. సినిమా రిలీజ్‌ల విషయంలోనూ దిల్‌ రాజు శాసిస్తాడు అని కామెంట్స్‌ చేస్తారు. అసలు నేను ఎవరిని శాసించడానికి. మంచి కోసం సలహాలిచ్చినా నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వాటిపై నేను స్పందించకపోవడం వల్ల తెలిసిన వాళ్లు, బంధువులు కూడా అవన్నీ నిజాలనే నమ్ముతున్నారు. అందుకే ఖండిస్తున్నా’’.

‘వారిసు’ సక్సెస్

‘‘వారిసు చిత్రం తమిళంలో సూపర్‌హిట్‌. మేమంతా ఆ సినిమా రిజల్ట్‌ విషయంలో ఫుల్‌ హ్యాపీగా ఉన్నాం. వంశీ లైన్‌ చెప్పిన వెంటనే విజయ్‌ వద్దకు తీసుకువెళ్లాం. ఆయనకు అది నచ్చింది. అలా, మేము తమిళంలో సినిమా చేశాం. తెలుగులో డబ్బింగ్‌ చేశాం. ఆ సినిమా రిజల్ట్‌ విషయంలో వంద శాతం హ్యాపీగా ఉన్నా’’ అని దిల్‌రాజు (Dil Raju) వివరించారు. భవిష్యత్తులో తాను భారీ ప్రాజెక్ట్‌లపైనే ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ (Ram Charan)తో పనిచేస్తున్న ఆయన త్వరలో పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో సినిమాలు చేస్తానని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి, సుకుమార్‌లతో కూడా సినిమాలు చేసే ఆలోచన ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని