Harish Shankar: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రీమేకా? హరీశ్‌ శంకర్ ఏమన్నారంటే!

దర్శకుడు హరీశ్ శంకర్ ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 24 Oct 2023 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ సినిమా రీమేకా? అని నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తాజాగా హరీశ్‌ శంకర్‌ సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఆయన అప్‌కమింగ్‌ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. #Askharish పేరుతో ఎక్స్‌లో సెక్షన్‌ నిర్వహించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ను ఉద్దేశిస్తూ.. పవన్‌ కల్యాణ్‌ను గుర్తుచేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి చిత్రబృందమంతా కష్టపడుతున్నట్లు చెప్పారు.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్‌ ఎప్పుడు?
హరీశ్‌ శంకర్‌: త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

మీకు నచ్చిన పవన్‌ కల్యాణ్ సినిమా ఏది?
హరీశ్‌ శంకర్‌: తొలిప్రేమ, ఖుషి

మల్టీ స్టారర్ సినిమా తీస్తారా? 
హరీశ్‌ శంకర్‌: దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

మీ సినిమా కంటే ముందు ‘ఓజీ’ వస్తే.. మీదానిపై అంచనాలు పెరిగిపోతాయంటారా?
హరీశ్‌ శంకర్‌: నా దృష్టిలో ఇలా విడుదలవ్వడం పోటీ కాదు. ఇది మనందరికీ ఒక వేడుకతో సమానం.

టాలీవుడ్‌ కంటే కోలీవుడ్‌లో మంచి సినిమాలు వస్తున్నాయంటారా?
హరీశ్‌ శంకర్‌: ప్రస్తుతం దేశమంతా తెలుగు సినిమా పరిశ్రమవైపు చూస్తోంది. అలాగే తమిళ ఆడియన్స్‌ కూడా వాళ్ల సినిమాలను ఎంతో గౌరవిస్తారు.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రీమేకా.. కాదా?
హరీశ్‌ శంకర్‌: నాపై నమ్మకం ఉంచండి. మీ ఎదురుచూపులకు తగ్గట్లు సినిమా ఉంటుంది. మీరు ఎంత భారీగా అంచనాలు పెట్టుకున్నా.. వాటిని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుంది.

మీ సినిమాలు రీమేక్‌లా ఉంటాయని టాక్ వినిపిస్తుంటుంది. మీరు కాపీ కంటెంట్‌ వాడతారా?
హరీశ్‌ శంకర్‌: నా వర్క్‌ నిజంగా తెలిసిన వారు వాటిని రీమేక్‌లు అని పిలవడానికి సిగ్గుపడతారు. నా పనిని చూసి నేనెప్పుడూ గర్వపడుతుంటా. విమర్శించేవారు ఉన్నప్పుడే మనం ఇంకా మెరుగ్గా ప్రయత్నిస్తాం. 

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కూడా ‘గబ్బర్‌సింగ్‌’ రేంజ్‌లో ఉంటుందా?
హరీశ్‌ శంకర్‌: పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. అయినా.. దానికి మించి ఉండాలని కోరుకుందాం.

ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
హరీశ్‌ శంకర్‌: కచ్చితంగా చూడొచ్చు. ఇది యూత్‌, మాస్ ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది. ప్రతి ప్రేక్షకుడికి కన్నుల పండుగగా ఉంటుంది.

ఇలాంటి పెద్ద సినిమా తీస్తున్నప్పుడు ఒత్తిడి గురైతారా?
హరీశ్‌ శంకర్‌: ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీదాన్ని జయించగలగాలి.

భవిష్యత్తులో ఏ జోనర్‌లో సినిమాలు తీస్తారు?
హరీశ్‌ శంకర్‌: మానవ సంబంధాలు, లవ్‌స్టోరీలు.. ఈ రెండు జోనర్‌లలో తీస్తాను.

ఇక ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (ustaad bhagat singh) విషయానికొస్తే..  ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో ఇది రానుంది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్‌ శ్రీలీల నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్రంలో ఇటీవలే ముఖ్యమైన భాగాన్ని పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని