Vivek Athreya: థ్రిల్లర్‌ కథతో సినిమా అనుకున్నా.. ‘అంటే.. సుందరానికీ!’ తీశా: వివేక్‌ ఆత్రేయ

తన మూడో చిత్రాన్ని థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించాలనుకున్నానని, నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు రొమాంటిక్‌ కామెడీ ‘అంటే.. సుందరానికీ!’ చిత్రం తెరకెక్కించాలని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తెలిపారు. 

Updated : 20 Jun 2023 19:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మెంటల్‌ మదిలో’ (Mental Madhilo) చిత్రంతో తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందిన దర్శకుడు.. వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya). రెండో సినిమా ‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura)తోనూ ప్రేక్షకుల్ని మెప్పించారాయన. ఈ రెండు హిట్‌ సినిమాల తర్వాత ఆయన థ్రిల్లర్‌ నేపథ్య కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారట. అయితే, మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) నిర్మాణ సంస్థ ఎంటర్‌టైనింగ్‌ స్టోరీ కావాలని కోరడంతో ‘అంటే.. సుందరానికీ!’ (Ante Sundaraniki) తెరకెక్కించినట్టు వివేక్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సదరు సంస్థకు థ్రిల్లర్‌ స్టోరీని సగం వినిపించానని, అప్పటికి స్క్రిప్టు పూర్తికాలేదన్నారు. అంతకు ముందు తీసిన సినిమా ఓ రకమైన థ్రిల్లరే కాబట్టి ఆ సంస్థ రొమాంటిక్‌ కామెడీని అడిగినట్టు వివరించారు.  

సుందర్‌ ప్రసాద్‌ (నాని) అనే బ్రాహ్మణ యువకుడు, లీలా థామస్‌ (నజ్రియ) అనే క్రిస్టియన్‌ అమ్మాయి మధ్య ప్రేమ కథే.. ‘అంటే సుందరానికీ!’. మతాంతర వివాహాల విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని వినోదాత్మక కోణంలో చూపించారు. గతేడాది విడుదలై, మిశ్రమ స్పందనలు పొందిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. వివేక్‌ తదుపరి చిత్రం.. నాని (Nani)తోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాను ఇంతకు ముందు రాసుకున్న పూర్తి స్థాయి థ్రిల్లర్‌ కథతోనే దాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయని సమాచారం. ‘దసరా’ (Dasara) విజయోత్సాహంలో ఉన్న నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. #Nani30 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్‌ కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని