Eagle Movie Review: రివ్యూ: ఈగల్‌.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా?

Eagle Movie Review: రవితేజ కథానాయకుడిగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 09 Feb 2024 14:03 IST

Eagle Movie Review; చిత్రం: ఈగల్‌; నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, వినయ్‌ రాయ్‌, కావ్యథాపర్‌, మధు, శ్రీనివాస్‌ అవసరాల, శ్రీనివాసరెడ్డి, అజయ్‌ ఘోష్‌ తదితరులు; సంగీతం: డేవ్‌ జాండ్‌; సినిమాటోగ్రఫీ: కమ్లీ ప్లాకీ, కరమ్‌ చావ్లా; ఎడిటింగ్‌: కార్తిక్‌ ఘట్టమనేని; నిర్మాత: టి.జి.విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల; స్క్రీన్‌ప్లే: మణిబాబు కరణం; రచన, దర్శకత్వం: కార్తిక్‌ ఘట్టమనేని; బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ; విడుదల: 09-02-2024

సంక్రాంతికి రావ‌ల్సిన ‘ఈగ‌ల్‌’ కాస్త ఆల‌స్యంగా మంచి ప్ర‌చార హంగామా మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పెద్ద‌గా పోటీ లేకుండా బాక్సాఫీస్ ముందుకొచ్చాడు ర‌వితేజ‌ (Ravi teja). మాస్ క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ఆయన ‘ధ‌మాకా’, ‘వాల్తేర్ వీర‌య్య’ చిత్రాల‌తో అద‌ర‌గొట్టారు. ఆ వెంట‌నే ‘రావ‌ణాసుర‌’, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ చిత్రాల‌తో  వ‌రుస ప‌రాజ‌యాల్ని ఎదుర్కొన్నారు. దాంతో ‘ఈగ‌ల్‌’ చిత్రంపై అంద‌రి దృష్టి ప‌డింది.  ప్ర‌చార చిత్రాల‌తో  విడుద‌ల‌కు ముందే ఆక‌ర్షించిన ఈ చిత్రం అంచనాలకు త‌గ్గ‌ట్టుగా ఉందా? (Eagle Movie Review) రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా?

క‌థేంటంటే: జ‌ర్న‌లిస్ట్ న‌ళిని  (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) రాసిన ఓ క‌థ‌నంతో మొద‌ల‌వుతుందీ క‌థ‌. చిన్న క‌థ‌నమే అయినా... అది ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈగ‌ల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన అంశం కావ‌డమే అందుకు కార‌ణం. మ‌న దేశానికి చెందిన ఇన్వెస్టిగేష‌న్ బృందాలు, న‌క్స‌లైట్లు, తీవ్ర‌వాదులతోపాటు ఇత‌ర దేశాలకు చెందిన వ్య‌క్తుల‌కీ టార్గెట్‌గా ఉంటుంది ఈగ‌ల్‌. స‌హదేవ్ వ‌ర్మ (ర‌వితేజ‌) ఒక్క‌డే ఈగ‌ల్‌ని ఓ నెట్‌వర్క్‌లా న‌డుపుతుంటాడు. చిత్తూరు జిల్లా త‌ల‌కోన అడ‌వుల్లోని ఓ ప‌త్తి మిల్లుతోపాటు, పోలండ్‌లోనూ ఆ నెట్‌వర్క్‌ మూలాలు బ‌హిర్గ‌తం అవుతాయి. ఇంత‌కీ ఈగ‌ల్‌కీ, త‌ల‌కోన అడవుల‌కీ సంబంధం ఏమిటి?స‌హ‌దేవ్ వ‌ర్మ ఎవ‌రు?అత‌ని గ‌త‌మేమిటి, ఈగ‌ల్ నెట్‌వర్క్‌ ల‌క్ష్య‌మేమిటి?ఈ విష‌యాల‌న్నీ జ‌ర్న‌లిస్ట్ న‌ళిని ప‌రిశోధ‌న‌లో ఎలా బ‌య‌టికొచ్చాయ‌నేది సినిమా.

ఎలా ఉందంటే: స్టైలిష్ యాక్ష‌న్ చిత్రాల హ‌వా కొన‌సాగుతున్న ఈ ద‌శ‌లో... ప‌క్కాగా ఆ కొల‌త‌ల‌తో రూపుదిద్దుకున్న మ‌రో చిత్ర‌మిది. నిర్ణ‌యం నియంత నివార‌ణ... అంటూ ఆయుధం ఎవ‌రి చేతుల్లో ఉండాలో ఈ క‌థ‌తో చెప్పిన విధానం ఆక‌ట్టుకుంటుంది. (Eagle Movie Review) ఈగ‌ల్, దాని నెట్‌వర్క్‌ ప‌రిశోధన‌లతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ ప‌రిశోధ‌న‌లో అస‌లు విష‌యాలు, అస‌లు పాత్ర‌లు వెలుగులోకి వ‌చ్చే వ‌ర‌కూ క‌థ అంత‌గా ర‌క్తి క‌ట్ట‌దు. ఈగ‌ల్ ప్ర‌స్తావ‌న రాగానే భ‌య‌ప‌డే వ్య‌క్తులు, అస‌లు క‌థ‌ని తెలుసుకునేందుకు క‌థానాయిక అనుప‌మ చేసే ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాల‌తోనే  ప్ర‌థ‌మార్ధం సాగుతుంది. విరామ స‌న్నివేశాల‌కు ముందే అస‌లు క‌థ‌లోకి ప్ర‌వేశించిన‌ట్టు అనిపిస్తుంది. విరామం త‌ర్వాత వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాల త‌ర్వాత సినిమా మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది.

ద‌ర్శ‌కుడు ఈ సినిమాను క‌థ‌లు క‌థ‌లుగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అది కొత్త ప్ర‌య‌త్న‌మే కావొచ్చు కానీ, పెద్ద‌గా ఫ‌లితం ఇవ్వ‌లేదు. కొన్నిచోట్ల క‌థ‌నం గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. ఇలాంటి మైన‌స్‌ల‌న్నింటినీ స్టైలిష్‌గా సాగే యాక్ష‌న్ ఘ‌ట్టాలు మ‌రిచిపోయేలా చేస్తాయి. అత్యున్న‌త‌మైన నిర్మాణ హంగులు, నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమా మ‌రో స్థాయికి వెళ్లింది. ద్వితీయార్ధంలో పోలండ్‌లో జ‌రిగే క‌థ‌, ప‌తాక స‌న్నివేశాల్లో సెంటిమెంట్‌, కొన‌సాగింపునకు కావ‌ల్సిన లీడ్‌ని ఇవ్వ‌డం వంటి అంశాల‌న్నీ కూడా ఆక‌ట్టుకుంటాయి. అమ్మ‌వారి విగ్ర‌హం నేప‌థ్యంలో యాక్ష‌న్ ఘట్టం సినిమాకే హైలైట్‌. (Eagle Movie Review in telugu) బ‌ల‌మైన అంశాన్ని.. బ‌ల‌మైన క‌థ‌తో చెప్పారు. ఆయుధాలు, ప‌త్తి పంట నేప‌థ్యాల్ని  ప్రేమ‌క‌థ‌తో క‌నెక్ట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. లోతైన మాట‌లు సినిమాకు ఆక‌ర్ష‌ణే అయినా,  క‌థ‌నంలోనే స‌ర‌ళ‌త్వం లోపించింది. యాక్ష‌న్ ప్రియుల్ని అల‌రించే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ర‌వితేజ చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి పాత్ర‌లో క‌నిపించారు. ఆయ‌న తెర‌పై రెండు కోణాల్లో క‌నిపిస్తారు. రెండు గెట‌ప్పులూ బాగా న‌ప్పాయి.

ఎవ‌రెలా చేశారంటే: ర‌వితేజ యాక్ష‌న్ అవ‌తారం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న స‌హ‌దేవ్ వ‌ర్మ పాత్ర‌లో ఒదిగిపోయారు. ద్వితీయార్ధంలో యంగ్ లుక్‌లోనూ ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న న‌ట‌న ఇందులో స‌హ‌జంగా ఉంది. అనుప‌మ‌, కావ్య థాప‌ర్ పాత్ర‌ల‌కీ ప్రాధాన్యం ఉంది. అనుప‌మ సినిమా మొత్తం క‌నిపిస్తే, కావ్య థాప‌ర్ ద్వితీయార్ధంలో చిన్న పాత్ర‌లోనే అయినా ఆక‌ట్టుకుంటుంది. న‌వ‌దీప్ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు. విన‌య్‌రాయ్‌, మ‌ధుబాల, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌దిత‌రుల పాత్ర‌లూ ఆక‌ట్టుకుంటాయి. అజ‌య్ ఘోష్‌, శ్రీనివాస‌రెడ్డి, మిర్చి కిర‌ణ్ న‌వ్వులు పంచుతారు.

సాంకేతికంగా... సినిమా ఉన్న‌తంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అత్యున్న‌త నిర్మాణ విలువ‌ల‌తో ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ఈ సినిమాను నిర్మించింది. మ‌ణిబాబు క‌ర‌ణం మాట‌లు బాగున్నాయి. సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. డేవ్ జాండ్ నేప‌థ్య సంగీతం ప్ర‌భావం చూపిస్తుంది. ర‌వితేజ‌, కావ్య థాప‌ర్‌ల‌పై ప్రేమ పాట, చిత్రీక‌ర‌ణ బాగుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల్నీ చూసుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాను స్టైలిష్‌గా తీయ‌డంలో విజ‌య‌వంత‌మ‌య్యారు. ర‌చ‌న‌లోనూ బ‌లం ఉంది.

  • బ‌లాలు
  • + ర‌వితేజ న‌ట‌న‌
  • + స్టైలిష్ మేకింగ్‌
  • + ద్వితీయార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆరంభ స‌న్నివేశాలు
  • చివ‌రిగా...: ఈగ‌ల్.. యాక్ష‌న్‌తో మెప్పిస్తాడు ర‌వితేజ (Eagle Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని