Karthikeya: విజయ్‌ దేవరకొండ, నవీన్‌చంద్ర మిస్సయ్యారు.. కార్తికేయ హిట్‌ కొట్టాడు!

కార్తికేయ గుమ్మకొండ హీరోగా దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఐదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 12 Jul 2023 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ (RX 100).. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన చిత్రం. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నేటితో 5 ఏళ్లు (5 Years For RX 100) పూర్తి చేసుకుంది. 2018 జులై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ విశేషాలను గుర్తు చేసుకుందాం..

అలా మొదలైంది..

దర్శకుడిగా అజయ్‌ భూపతి (Ajay Bhupathi)కిదే తొలి చిత్రం. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) శిష్యుడైన ఈయన తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. వర్మ ‘ఎటాక్‌’ సినిమాను చిత్రీకరిస్తున్న రోజులవి. అదే సమయంలో ఓ అమ్మాయి అజయ్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి, తర్వాత మోసం చేసిందట. ఆ బాధతో అజయ్‌ ‘ఎటాక్‌’ సినిమాపై దృష్టి పెట్టలేకపోయారు. ‘ఇలాంటి బాధ చాలా తక్కువ మందికి కలుగుతుంది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉన్నావు కాబట్టి.. దాన్నే వినియోగించుకుని, డబ్బు సంపాదించుకో’ అని ఎవరో సలహా ఇవ్వగా అజయ్‌కి మొదట అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ మాట విలువ అర్థం చేసుకున్న అజయ్‌ తన లవ్‌ ఫెయిల్యూర్‌ని ముందుగా పేపర్‌పై పెట్టి, తర్వాత యాక్షన్‌ చెప్పి తెరపైకి తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఈ కథని అంగీకరిస్తారా? సినిమా హిట్‌ అవుతుందా? ఫట్‌ అవుతుందా?.. ఇవేవీ ఆలోచించకుండా ఆ అమ్మాయిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారట.

విజయ్‌ దేవరకొండకు చెప్పారు కానీ..

స్క్రిప్టు పనులు పూర్తయ్యాక అజయ్‌ నటీనటుల కోసం అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో ఈ కథ విన్న తొలి హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ‘‘పెళ్లి చూపులు’ సినిమా మొదలుకాకముందే విజయ్‌కి ఈ కథ చెప్పా. విజయ్‌ది పట్టణ నేపథ్యం. ఈ కథేమో గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. అందుకే విజయ్‌కి ఈ స్టోరీ నచ్చలేదేమో’’ అని అజయ్‌ ఓ సందర్భంలో తెలిపారు. నవీన్‌ చంద్ర (Naveen Chandra)తోనూ ఈ సినిమా చేయాలనుకుని లుక్‌ టెస్ట్‌ కూడా చేశారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత చాలామంది హీరోలకు కథ చెప్పినా ఫలితం లేకపోవడంతో దర్శకుడు ఓ నిర్ణయానికొచ్చారు.

ఇలాంటి స్టోరీని హీరోలకు కాదు.. నిర్మాతలకు నచ్చాలనుకుని వారికే చెప్పేవారు. ఆ క్రమంలో ‘ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులు చూడరు’ అనే సమాధానం వినిపించేది. దాంతో, కొత్తవారితో వర్కౌట్‌ అవుతుందేమో చూద్దామని హీరో కార్తికేయను కలిశారు. అప్పటికి కార్తికేయ ‘ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమాలో నటించి ఉన్నాడు. ఆ సినిమా బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువైంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ విషయంలో అలా జరగదని టెస్ట్‌ షూట్‌తో నిరూపించుకున్న అజయ్‌ సినిమాని తెరకెక్కించే అవకాశం అందుకున్నారు. కార్తికేయ కెరీర్‌ గ్రాఫ్‌ని అమాంతం పెంచేశారు.

హీరోయిన్‌ విషయంలోనూ..

ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్ర బోల్డ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నేటివిటికీ తగ్గట్టు తెలుగు హీరోయిన్‌ని తీసుకోవాలని అజయ్‌ ఎంతగానో ప్రయత్నించారు. నెగెటివ్‌ ఛాయలున్న ఆ పాత్రలో నటించేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దాంతో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput)ని ఎంపిక చేశారు. అలా అవకాశం అందుకున్న పాయల్‌ తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని