Khaleja: ఖలేజా టైటిల్‌.. అత్యాశకు పోయి రూ.10లక్షలు పోగొట్టుకున్నారు!

Khaleja: మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ సినిమా ఫలితం ఎలా ఉన్నా, మూవీ టైటిల్‌ వివాదం అప్పట్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Updated : 12 Jul 2023 10:26 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖలేజా’ (Khaleja). 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ, మహేశ్‌బాబు బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌ను ఒక భిన్న కోణంలో చూపించి, అభిమానులను అలరించింది. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో టైటిల్‌పై వివాదం నెలకొంది.

మొదట ఒప్పుకొన్నారు

‘ఖలేజా’ టైటిల్‌ను ఓ వ్యక్తి నిర్మాతల మండలిలో ముందే రిజిస్టర్‌ చేసుకున్నారు. మహేశ్‌ మూవీకి చిత్ర బృందం ఈ టైటిల్‌ను ప్రకటించేసరికి సదరు వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండా ‘ఇంజెక్షన్‌’ ఆర్డర్‌ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి ‘ఖలేజా’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తికి ఒక సూచన చేశారు. ‘వాళ్లు ఇప్పటికే షూటింగ్‌, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశారు. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో సినిమా విడుదలకాకుండా ఆపమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదేమో. నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం చేయవచ్చు. మీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి’ అని అడిగారు. తుది తీర్పును భోజన విరామం తర్వాత ప్రకటిస్తానని న్యాయమూర్తి చెప్పారు. దీంతో సదరు వ్యక్తి రూ.10లక్షలు పరిహారం కింద కోరారు.

ఇదీ చదండి: ‘కేజీయఫ్‌’ బాటలోనే ‘సలార్‌’.. నీల్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఒకటి కాదు రెండు!

ఆ తర్వాత మాట మార్చారు

‘ఖలేజా’ నిర్మాతలు కూడా రూ.10లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. న్యాయమూర్తే స్వయంగా పరిహారం ఇప్పిస్తానని చెప్పడంతో టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తి తన మనసు మార్చుకున్నారు. విరామానంతరం కోర్టు మళ్లీ ప్రారంభం కాగా, తనకు రూ.10లక్షలు కాదని, రూ.25లక్షలు ఇవ్వాలని కోరారు. దీంతో కొద్దిసేపు వాదోపవాదనలు జరిగాయి. తొలుత రూ.10లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలిసింది. దీంతో ఆయన స్పందిస్తూ ‘ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేం. అలాగే తుది నిర్ణయమూ తీసుకోలేం. మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటివరకూ సినిమా ఆగకుండా కోర్టు ఆపలేదు. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రండి. అప్పటివరకూ మీ పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తున్నా’ అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో ‘ఖలేజా’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయారు. మరోవైపు సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ‘మహేశ్‌ ఖలేజా’ అంటూ చిత్ర బృందం సినిమాను విడుదల చేసింది. అప్పట్లో పలు సినిమాల టైటిల్స్‌ విషయంలో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసును వాదించిన న్యాయవాది కూడా పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది దర్శక-నిర్మాతలు తెలివిగా తాము అనుకున్న టైటిల్‌ ముందు హీరో పేరు పెట్టి సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇక మహేశ్‌బాబు కొత్త సినిమా విషయానికొస్తే, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన ‘గుంటూరుకారం’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. శ్రీలీల కథానాయిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని