
నాన్నా.. మీరే సర్వస్వం: ధ్రువ్
కోడంబాక్కం : ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు ధ్రువ్. విక్రం నట వారసుడిగా మంచి మార్కులు సంపాదించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయన్ను ఇప్పుడు 10 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా ధ్రువ్ స్పందిస్తూ ‘కొన్ని సందర్భాల్లో మనపైనే మనకు సందేహం కలుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనక్కి తగ్గకూడదు. నిజాయితీతో కఠోరంగా శ్రమించగలననే నమ్మకం వస్తే ఎంత దూరమైనా ప్రయాణించి, ఏదైనా సాధించగలం. ఈ విషయానికి పూర్తి ఉదాహరణ మా నాన్నే. ఆయన్ను చూస్తే నాపై నాకు మరింత నమ్మకం కలుగుతుంది. ‘ఆదిత్య వర్మ’ చిత్రం తెరకెక్కడంలో నాన్న మాత్రమే కీలకమైన వ్యక్తి అని చెప్పగలను. అది రిమేక్ చిత్రమే అయినప్పటికీ నా హృదయానికి అత్యంత దగ్గరైన సినిమా’ అని పేర్కొన్నారు. అలాగే తన తండ్రి విక్రం గురించి ప్రస్తావిస్తూ ‘ఓ అభిమానిగా ఆరాధించిన నాన్న వద్ద.. ఓ శిష్యుడిగా చాలా విషయాలు నేర్చుకున్నా. నన్ను నేను ఓ శిలలా మలచుకున్నా. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నాన్నే. ‘నాన్నా.. నేను మీ అంత గొప్ప వ్యక్తిని కాలేనని నాకు బాగా తెలుసు. కానీ చాలా గర్వంగా ఉంది’. కృతజ్ఞతలు నాన్నా’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు ధ్రువ్. ఈ సందర్భంగా ‘ఆదిత్య వర్మ’ సెట్‌లోని పలు ఆసక్తికరమైన చిత్రాలను ఆయన పోస్ట్ చేశారు. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఆదిత్య వర్మ షూటింగ్ స్పాట్‌లో తండ్రీకుమారుల చిత్రాలు