Updated : 31 Oct 2021 05:23 IST

Allu Arjun: మనతో మనమే పోటీ పడాలి

అల్లు అర్జున్‌

‘‘పక్కనున్నవాళ్లని చూసి పరిగెత్తడం కాదు. ముందు చూపుతో... మనతో మనమే పోటీ పడుతూ పరిగెత్తాలి. ప్రతి ఒక్కరిలోనూ వారిదైన ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకరితో మనం పోల్చుకోకుండా మన ప్రత్యేకతని నమ్ముకుని అడుగులు వేయాలి’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన ముఖ్య అతిథిగా శనివారం హైదరాబాద్‌లో ‘పుష్పకవిమానం’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. గీత్‌ సైని, శాన్వి మేఘన కథానాయికలు. గోవర్ధనరావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి నిర్మాతలు. కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సమర్పకులు. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ విడుదల అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘నాకు ట్రైలర్‌ చాలా బాగా నచ్చింది. నా సొంత సినిమా అయినా, నాకు దగ్గరైనవాళ్ల సినిమా అయినా నచ్చకపోతే దాని గురించి పెద్దగా మాట్లాడను. ఈ బృందానికి ముందస్తుగా అభినందనలు చెబుతున్నా. గీత్‌ సైని తెలుగమ్మాయి. తెలుగమ్మాయిలు వచ్చి సినిమాలు చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేఘన టైమింగ్‌ చాలా బాగుంది. ఆనంద్‌ దేవరకొండకి మంచి సంగీతాభిరుచి ఉందని తెలిసింది. అందుకే తన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ఈ ‘పుష్పకవిమానం’ కచ్చితంగా ఎగురుతుంది’’ అన్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని,  నివాళి అర్పించారు. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నా నిర్మాణ సంస్థలో రెండో సినిమా ఇది. నా దగ్గర కొంచెం శక్తి ఉంటే, అప్పుడు ఇలా మంచి స్క్రిప్ట్‌ దొరికితే దాని వెనక ఉండాలనుకున్నా. ఆ ఆలోచనతోనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశా. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చేసినప్పట్నుంచి నాకు ఈ చిత్ర దర్శకుడు దామోదర్‌ పరిచయం. సునీల్‌ అన్న ఎంతో బలాన్ని తీసుకొచ్చాడు చిత్రానికి. నటన, ఆలోచనల పరంగా అల్లు అర్జున్‌ నాకు స్ఫూర్తినిస్తుంటారు. ఆయన ‘పుష్ప’ ప్రచార చిత్రాలు చూసినప్పుడు మరింత  కష్టపడదాం అనిపిస్తుంటుంది. పునీత్‌ అన్న దూరం కావడం చాలా బాధగా అనిపించింది. మనమందరం పోతాం. ఉన్నంతవరకు సంతోషంగా ఉందాం, పనిచేద్దాం, ప్రేమిద్దాం, ఒకరినొకరికి అండగా నిలవండి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కిరీటి, అజయ్‌, గిరిధర్‌, అభిజిత్‌, ఆట సందీప్‌, జ్యోతి, ఫణికుమార్‌తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని