Godfather: మనం కలిస్తే రూ.3,000-4,000 కోట్ల వ్యాపారం

హిందీ, దక్షిణాది పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌. చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శనివారం ముంబయిలో జరిగింది.

Updated : 02 Oct 2022 08:56 IST

- సల్మాన్‌ఖాన్‌

హిందీ, దక్షిణాది పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ (Salmaan Khan). చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శనివారం ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘కొందరు హాలీవుడ్‌ చిత్రాల్లో పని చేయాలనుకుంటున్నారు. నేనైతే దక్షిణాదికి వెళ్లాలనుకుంటున్నా. హిందీ, దక్షిణాది నటులు కలిసి పనిచేస్తే లెక్కలు ఊహించని విధంగా ఉంటాయి. ఉదాహరణకు చిరంజీవి అభిమానులు నన్ను ఆదరిస్తే.. నా అభిమానులు తనకి అభిమానులైతే..సంఖ్య భారీగా పెరుగుతుంది. జనం ఇప్పుడు రూ.300-రూ.400 కోట్ల సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మనం కలిస్తే రూ.3,000-రూ.4,000 కోట్లను తేలికగా దాటొచ్చు. మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తే ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ప్రపంచమంతా చూస్తారు. నా తొలి తెలుగు సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఈ సినిమాని చాలా ఉత్సాహంగా చేశా. ఆ ఉత్సాహాన్ని తెరపై చూస్తార’’న్నారు. మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


తరతరాల జ్ఞాపికలా అల్లు స్టూడియో

రాబోయే తరాలు కూడా పేరుని తలచుకోవడం కోసం... ఓ జ్ఞాపికలా, కృతజ్ఞతగా ఏర్పాటైందే అల్లు స్టూడియో (Allu Studio) అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. శనివారం ఆయన మామ, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య శతజయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కోకాపేట్‌లో అల్లు అరవింద్‌ కుటుంబం నిర్మించిన అల్లు స్టూడియోని చిరంజీవి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘అల్లు స్టూడియో లాభాపేక్ష కోసం నిర్మించింది కాదు. నటుడిగా అల్లు రామలింగయ్య స్థాయికి చిహ్నంగా భావిస్తున్నా. అల్లు అరవింద్‌, వారి కుమారులు బాబీ, అర్జున్‌, శిరీష్‌ ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం అల్లు రామలింగయ్య. దశాబ్దాల కిందట నటుడిగా నిలదొక్కుకోవాలనే ఆయన బలీయమైన ఆలోచనే నేడు వ్యవస్థగా మారింది. ఆయనపై కృతజ్ఞతతో, ఆయన పేరు ఎప్పుడూ వినిపించేలా ఈ స్టూడియోని ఏర్పాటు చేయడం అభినందనీయం’’ అన్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని