సంక్షిప్త వార్తలు(6)

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం ఖరారైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.

Published : 08 Feb 2023 01:38 IST

కొత్త కబురు వచ్చేసింది

యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం ఖరారైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కొత్త దర్శకురాలు వైష్ణవి తెరకెక్కించనున్నారు. ఈ కొత్త సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. సిద్ధు ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ‘డీజే టిల్లు’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది.


మహిళలకు ఉచితం

సుహాస్‌ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. టీనా శిల్పరాజ్‌ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఎవరి కోసం చేశామో.. వారికి చేర్చాలనే ఉద్దేశంతో నిర్మాతలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాని ఆడవాళ్లకు ఉచితంగా చూపించనున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశించిన థియేటర్లలో బుధవారం ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తున్నాం. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో సుమ, శరత్‌, అనురాగ్‌, షణ్ముఖ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


దేశ భక్తి నేపథ్యంలో..

రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం’. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘దేశ భక్తి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో రవీంద్ర 14మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలు వేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.


‘సిఎస్‌ఐ సనాతన్‌’ వచ్చేస్తున్నాడు

ఆది సాయికుమార్‌ ‘సీఎస్‌ఐ సనాతన్‌’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శివశంకర్‌ దేవ్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మాత. మిషా నారంగ్‌ కథానాయిక. నందిని రాయ్‌, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. ‘‘ఇదొక భిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. విక్రమ్‌ అనే పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు క్రైమ్‌ సీన్‌ ఆఫీసర్‌ ఆది ఏం చేశారు? ఆ కేసు విషయంలో ఆయనకెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది చిత్ర కథాంశం. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: అనీష్‌ సోలోమాన్‌.


అక్షయ్‌తో మృణాల్‌ ఆటాపాటా

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తాజాగా ఆయన ఇమ్రాన్‌ హష్మీతో కలిసి ‘సెల్ఫీ’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేక్‌ ఇది. తాజాగా ఈ చిత్రంలోని ‘కుడియే నీ తేరి’ అనే కొత్త పాట టీజర్‌ను విడుదల చేశారు. ఈ పాటలో మృణాల్‌ అతిథి పాత్రలో నటించింది. పూర్తి పాట ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో డయానా పెంటీ, నుష్రత్‌ బరూచ ముఖ్యపాత్రల్లో నటించారు. రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని, ‘మై ఖిలాడీ తు అనారీ’ గీతాన్ని విడుదల చేశారు.


యాక్షన్‌ థ్రిల్లర్‌.. హెబ్బులి

కిచ్చ సుదీప్‌, అమలాపాల్‌ జంటగా ఎస్‌.కృష్ణ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఈ సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత సి.సుబ్రహ్మణ్యం. ఇది ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం చిత్ర పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘అన్ని రకాల వాణిజ్య హంగులున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. కన్నడలో భారీ వసూళ్లు సాధించింది. అందుకే ఫ్యాన్సీ రేటుతో తెలుగు డబ్బింగ్‌ హక్కులు కొన్నాము. ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్‌, ప్రసన్న కుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని