సంగీత దర్శకుడు కోటికి అరుదైన గౌరవం

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అరుదైన గౌరవం అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ పార్లమెంట్‌లో జరిగిన సెలబ్రేషన్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

Published : 30 May 2023 00:37 IST

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అరుదైన గౌరవం అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ పార్లమెంట్‌లో జరిగిన సెలబ్రేషన్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ‘‘ఈ పురస్కారాన్ని అందించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ప్రవాస భారతీయులకు, ఐక్యరాజ్యసమితి సభ్యులకు కృతజ్ఞతలు. నాకిచ్చిన అవార్డును భారతదేశానికి అంకితం చేస్తున్నాను. జైహింద్‌’’ అన్నారు.


37 ఏళ్ల తర్వాత మలయాళంలో..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక మలయాళ సినిమాకి సంతకం చేశారు. దర్శకుడు బేబీ జాన్‌ వాల్యత్‌ స్వయంగా నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్న ‘మెజీషియన్‌’ అనే చిత్రానికి ఆయన బాణీలు సమకూర్చనున్నారు. చివరిసారి ఆయన 1996లో వచ్చిన ‘దేవరాగం’కి సంగీత దర్శకత్వం వహించారు. తిరువనంతపురంలోని జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో కీరవాణి తనకిష్టమైన సంగీత దర్శకుడు బాబూరాజ్‌ సంగీతం సమకూర్చిన కొన్ని మలయాళం పాటల్ని స్వయంగా ఆలపించారు.


విద్యార్థులు తలచుకుంటే..

సాయిచరణ్‌, పల్లవి జంటగా జిఎల్‌బి శ్రీనివాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఐక్యూ’. పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌.. అన్నది ఉపశీర్షిక. కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో బాలకృష్ణ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విద్యార్థులు తలచుకుంటే ఏమైనా చేయగలరన్న ఇతివృత్తంతో సినిమా సాగుతుంది. జూన్‌ 2న ఈ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమంలో పి.ఘటికాచలం, పల్లె రఘునాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


నిత్యం జ్వలించాల్సిందే!

ణ్‌దీప్‌ హుడా కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్వతంత్య్ర వీర్‌ సావర్కర్‌’. స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ అతివాది వీర్‌ సావర్కర్‌ జీవితం ఆధారంగా రూపొందుతోందీ సినిమా.తాజాగా చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ‘స్వాతంత్య్ర సంగ్రామం తొంభై ఏళ్లుగా సాగుతోంది. ఇది పిడికెడు మంది పోరాటం. ఇంకొందరిది అధికారం కోసం ఆరాటం. గాంధీజీ చెడ్డవాడేం కాదు.. కానీ ఆయన అహింసా సిద్ధాంతం వైపున నిలబడకపోయి ఉంటే భారత్‌కి 35 ఏళ్ల కిందటే స్వాతంత్య్రం వచ్చి ఉండేది. లంకను బంగారు గనిగా భావిస్తుంటారు. కానీ అది స్వేచ్ఛకు సంకెళ్లు వేసే నేలగా మారితే.. రావణ్‌రాజ్‌ అయినా, బ్రిటీష్‌రాజ్‌ అయినా అగ్నికి ఆహుతి కావాల్సిందే. నిత్యం జ్వలిస్తూ ఉండాల్సిందే..’ అనే పవర్‌ఫుల్‌ డైలాగులు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రణ్‌దీప్‌ హుడా ఈ సినిమా కోసం 26 కేజీలు బరువు తగ్గాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని