రివ్యూ: సరిలేరు నీకెవ్వరు

గతేడాది ‘మహర్షి’తో ప్రేక్షకులను పలకరించిన మహేశ్‌బాబు ఆ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’లతో వరుస సందేశాత్మక సినిమాలు చేస్తూ సాగుతున్న మహేశ్‌ నుంచి ‘పోకిరి’, ‘దూకుడు’ తర్వాత మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ను...

Updated : 11 Jan 2020 10:40 IST

చిత్రం: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు: మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేశ్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజ, రోహిణి, సూర్య, తమన్నా (ప్రత్యేకగీతం)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాత: అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుదల తేదీ: 11-01-2020

‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’లతో వరుస సందేశాత్మక సినిమాలు చేస్తూ సాగుతున్న మహేశ్‌ నుంచి ‘పోకిరి’, ‘దూకుడు’ తర్వాత మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ను చూసి ప్రేక్షకులకు చాలా కాలమైంది. అలాంటి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ రూపంలో ముందుకు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. అంతేకాదు, 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం, అదీ మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్మీ అధికారిగా మహేశ్‌ ఎలా నటించారు? ప్రొఫెసర్‌ భారతి పాత్రలో విజయశాంతి పాత్ర ఎలా చేశారు? అనిల్‌ రావిపూడి మహేశ్‌ను ఎలా చూపించారు? మహేశ్‌ నుంచి పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను కోరుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరిందా?

కథేంటంటే: అజయ్‌ కృష్ణ (మహేశ్‌బాబు) ఆర్మీలో మేజర్‌. ధైర్య సాహసాలు కలిగిన ఆర్మీ అధికారి. కొందరు ఉగ్రవాదులు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్‌ చేస్తారు. వారి చెర నుంచి విద్యార్థులను విడిపించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు మహేశ్‌బాబు, అతని టీమ్‌. ఆ సమయంలో మేజర్‌ అజయ్‌ కృష్ణకు ఒక ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఆర్మీ నిబంధనలకు కట్టుబడి కర్నూలు బయలుదేరి వస్తాడు. అక్కడ భారతి (విజయశాంతి) కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో ప్రొఫెసర్‌. కశ్మీర్‌లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే అజయ్‌కృష్ణ.. వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే భారతిని వెతుక్కుంటూ కర్నూలుకు ఎందుకు రావాల్సి వచ్చింది? అజయ్‌ కర్నూలు వచ్చేసరికి భారతి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు? ఆ పరిస్థితులకు కారణం ఎవరు? ఆమెను ఆ ఆపద నుంచి అజయ్‌ ఎలా రక్షించాడు? అసలు ప్రొఫెసర్‌ భారతికి అజయ్‌కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? మంత్రి నాగేంద్రప్రసాద్‌ (ప్రకాష్‌రాజ్) కథేంటి? చివరకు అతను ఏమయ్యాడు? మధ్యలో సంస్కృతి (రష్మిక) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: మహేశ్‌బాబు నుంచి ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ ‘సరిలేరు నీకెవ్వరు’తో ఎట్టకేలకు నెరవేరింది. సగటు మహేశ్‌ అభిమాని ఏం కోరుకుంటాడో అవన్నీ రంగరించి తయారు చేసుకున్న కథలా అనిపిస్తుంది. ఆర్మీ అధికారిగా మహేశ్‌ లుక్‌, యాక్షన్‌ ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుంది. అదే సమయంలో ప్రొఫెసర్‌ భారతిని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ చూపించాడు. ఆర్మీ నేపథ్యంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల నుంచి మహేశ్‌బాబు విద్యార్థులను కాపాడే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అనుకోని పరిస్థితుల్లో అజయ్‌ రైలులో కర్నూలు బయలుదేరతాడు. అప్పటివరకూ సీరియస్‌గా సాగిన కథలోకి రష్మిక, సంగీత, రావు రమేష్‌, బండ్ల గణేశ్‌ తదితర పాత్రలు ప్రవేశిస్తాయి. ఆ పాత్రలన్నీ అలరిస్తాయి. రైలులో జరిగే సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయి. అజయ్‌ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక నటన, మేనరిజం.. బ్లేడ్‌ గ్యాంగ్‌గా బండ్ల గణేష్‌ హంగామాతో ప్రథమార్ధం కితకితలు పెట్టిస్తుంది. ఆ తర్వాత కథ కర్నూలు చేరుకోవడంతో కథలోకి మళ్లీ సీరియస్‌నెస్‌ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అజయ్, భారతి-నాగేంద్ర ప్రసాద్‌ మధ్య పోరు మొదలవుతుంది. 

ద్వితీయార్ధం మొత్తం అజయ్‌-భారతి-నాగేంద్ర ప్రసాద్‌ ఈ మూడు పాత్రల మధ్యే ప్రధానంగా సన్నివేశాలు సాగుతాయి. ఒక హత్య కేసు కోసం భారతి పోరాటం చేయడం, ఆమె కుటుంబంపై నాగేంద్ర ప్రసాద్‌ కక్ష సాధించడం, విషయం తెలిసిన అజయ్‌ ఆ చర్యలను అడ్డుకోవడం ఇలా సన్నివేశాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మహేశ్‌-విజయశాంతి-ప్రకాష్‌రాజ్‌ ఒకరితో పోటీ పడి మరొకరు నటించారు. ప్రథమార్ధంలో కామెడీకి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు ద్వితీయార్ధంలో కథనం సీరియస్‌గా నడుపుతూనే, క్రైమ్‌ బ్రాంచ్‌ కోటిగా సుబ్బరాజు, కిషోర్‌లతో కామెడీతో పంచే ప్రయత్నం చేశాడు. రాజకీయ నాయకులను బంధించి మహేశ్‌బాబు చెప్పే పిట్ట కథ, వాళ్లను భయపెట్టడానికి బాంబు పెట్టడం తదితర సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఇక విజయశాంతి-మహేశ్‌బాబుల మధ్య ఆర్మీ గొప్పదనం గురించి సన్నివేశాలు ఉద్విగ్నతకు గురి చేస్తాయి. ఆ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఒళ్లు గగురుపొడిచేలా చేస్తుంది. ముఖ్యంగా మహేశ్‌ కర్నూలు వచ్చిన కారణాన్ని చెప్పే సన్నివేశంలో భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. ఇంచుమించుగా మూడు గంట‌ల నిడివి ఉన్న సినిమా ఇది. దీంతో ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే, కథ సీరియస్‌గా సాగుతూనే మహేశ్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల సమయంలోనూ మహేశ్‌ పంచ్‌లు, ప్రాసలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వెండితెరపై తళుక్కున మెరుస్తారు. అయితే, ఆయన ఎలా కనిపిస్తారన్నది వెండితెరపై చూడాల్సిందే. ఆయా సన్నివేశాలు అభిమానులకు పండగే. సన్నివేశాలకు ఇంకాస్త కత్తెర వేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్‌ రొటీన్‌కు భిన్నంగా సాగుతుంది.

ఎవరెలా చేశారంటే

చాలా రోజుల తర్వాత మహేశ్‌బాబుకు ఒక పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేసే అవకాశం లభించింది. ఆర్మీ అధికారిగా, భారతి కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించారు. మేజర్‌ అజయ్‌కృష్ణగా ఉన్నంతసేపు హుందాగా నటించిన ఆయన కర్నూలు బయలుదేరిన తర్వాత నుంచి ఇంకాస్త ఎనర్జిటిక్‌గా నటించారు. ‘పోకిరి’, ‘దూకుడు’ తర్వాత ఆ స్థాయి కామెడీ టైమింగ్‌తో అలరించారు. ముఖ్యంగా మహేశ్‌ డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌లు, యాక్షన్‌ అభిమానులను విశేషంగా అలరిస్తుంది.


దాదాపు పదమూడేళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. ఇందులో ప్రొఫెసర్‌ భారతిగా ఒక పవర్‌ఫుల్‌ పాత్ర పోషించారు. మహేశ్‌తో సన్నివేశాలతో పాటు, ప్రకాష్‌రాజ్‌కు సవాల్‌ విసిరే సన్నివేశాల్లో విజయశాంతి అదరగొట్టేశారు. ముఖ్యంగా ఆర్మీ గొప్పదనం గురించి మహేశ్‌-విజయశాంతిల మధ్య వచ్చేసన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. విజయశాంతి డైలాగ్‌ డెలివరీ, డిక్షన్‌ తెరపై చూస్తుంటే, పాత విజయశాంతి గుర్తుకు రాకమానదు.


క కథానాయికగా రష్మిక పాత్ర పర్వాలేదు. అనిల్‌రావిపూడి తన కథానాయికలకు ఒక ప్రత్యేక మేనరిజం పెడతారు. ఇందులో రష్మిక ‘అర్థమవుతుందా..’ అంటూ పలికే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. మహేశ్‌బాబును ప్రేమించే అమ్మాయిగా మాత్రమే ఆమె నటన అలరిస్తుంది. ముఖ్యంగా రైలులో వచ్చే సన్నివేశాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.


తాతగా, తండ్రిగా వైవిధ్య పాత్రలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌ ఇందులో మరోసారి ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. మంత్రి నాగేంద్ర ప్రసాద్‌గా ఆయన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా మహేశ్‌-ప్రకాష్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. 


రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజలు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. తెర నిండా నటీనటులే కనిపిస్తారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 


దేవిశ్రీ ప్రసాద్‌ మరోసారి తన మేజిక్‌ చూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ యాంథమ్‌ తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడుస్తుంది. పార్టీ సాంగ్‌  ‘డాంగ్‌ డాంగ్‌’, ‘హీ ఈజ్‌ సో క్యూట్‌’, ‘సూర్యుడివో.. చంద్రుడివో’ పాటల తెరపై బాగున్నాయి. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌. ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు, యాక్షన్‌ సీన్‌లను నేపథ్య సంగీతం అద్భుతంగా ఎలివేట్‌ చేసింది. 


మాస్‌, ఎంటర్‌టైనర్‌లు తీయడంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి సిద్ధహస్తుడు. గత చిత్రాలను చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మరోసారి అదే బాటలో పయనించారు. అయితే, ఈసారి మహేశ్‌బాబు కథానాయకుడు కావడంతో తెరపై ఎక్కువగా చూపించేందుకు ఆయనకు స్కోప్‌ లభించింది. మహేశ్‌ అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే విధంగా తెరపై చూపించడంలో అనిల్‌ రావిపూడి సఫలమయ్యారు. సాంకేతికంగా సినిమాను చాలా చక్కగా తీశారు. ఇటీవల కాలంలో మహేశ్‌ అత్యంత త్వరగా పూర్తి చేసిన సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా వేగంగా సినిమాను తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపిస్తుంది. ముగ్గురు నిర్మాతలు కావడం, మహేశ్‌ హీరో కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. సినిమా కోసం రూపొందించిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్‌తో పాటు ఇతర సెట్‌లు కూడా సహజంగా తీర్దిదిద్దారు.

బలాలు బలహీనతలు
+ మహేశ్‌బాబు - ద్వితీయార్ధం నిడివి
+ విజయశాంతి - క్లైమాక్స్‌
+ కామెడీ  
+ యాక్షన్‌ సన్నివేశాలు  

చివరిగా: మహేశ్‌ అభిమానులారా.. ‘మీకు అర్థమవుతోందా.. బొమ్మ దద్దరిల్లిపోద్ది’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇవీ చదవండి...

 

 

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని