Updated : 15 May 2020 21:40 IST

ప్రతిసారీ అలా షాక్‌ ఇవ్వాల్సిందే!

ఉరిమే ఉత్సాహం అనే మాటకి ప్రతీక... యువ కథానాయకుడు రామ్‌. తెరపై ఆయన జోరు చూస్తే... ప్రేక్షకుడిలోనూ అంతే హుషారు వచ్చేస్తుంది. నచ్చింది చేయడాన్ని ఇష్టపడే రామ్‌, తనకి నచ్చిన సినిమా రంగంలోనే కెరీర్‌ని మలుచుకున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న రామ్‌, త్వరలో ‘రెడ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా రామ్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...

లాక్‌డౌన్‌ తర్వాత జీవితం ఎలా ఉంది?
కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నాకు ఇంట్లో గడపడమే ఇష్టం. ఉదయాన్నే లేవటం, నా పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడటం..అంతే. ఇప్పుడు ఇంతకంటే చేసేదేం లేదు కదా. అయితే ఈ సమయంలో చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరం ఊహించని విచిత్ర పరిస్థితి ఇది.  
అలా ఇబ్బంది పడుతున్నవాళ్లకి మీ సలహా ఏమిటి?
మనకి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. కరోనా కారణంగా ఎవరి స్థాయిలో వాళ్లు ఇబ్బందులు పడుతున్నాం. అలాగని  నెగిటివిటీనే చూడకూడదు. ఇందులో పాజిటివిటీని కూడా వెతకాలి. ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం కాబట్టి, ఇప్పుడు దొరికిన ప్రశాంతతని ఆస్వాదించాలి.

పుట్టినరోజు అంటే చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది. కొంచెం పెద్దయ్యాక ‘మనం పుట్టినందుకు మనం ఆనందపడకూడదు. మన చుట్టుపక్కలవాళ్లు ఆనందపడాలి’ అని ఎక్కడో చదివా. అప్పట్నుంచి సంబరాలు చేసుకోవడం మానేశా. హీరో అయ్యాక, అభిమానులు సందడి చూసి చిన్న ఆనందం కలిగింది. అప్పట్నుంచి వాళ్ల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటా’’.

లాక్‌డౌన్‌తో ‘రెడ్‌’ విడుదల ఆగడం నిరాశపరిచిందా?  
సినిమా ఈ రోజు కాకపోతే రేపు విడుదలవుతుంది. కానీ కరోనా సమాజంపై చాలా ప్రభావం చూపింది కదా. దీనివల్ల చాలామందికి తిండి కూడా దొరకడం లేదు. సినిమాలతో మాకు నష్టం వచ్చినా మరో సినిమా నుంచి రాబట్టుకుంటాం. ముందు సమాజం బాగుండాలి.
‘రెడ్‌’ కోసం ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేశాయట?
కొన్ని మంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ థియేటర్లలోనే విడుదల చేస్తాం. అక్కడి అనుభవం వేరు కదా. ఇదొక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. మాస్‌ అంశాలు ఉన్నాయి. అవన్నీ థియేటర్లలో చూస్తేనే కిక్‌ ఉంటుంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ‘రెడ్‌’ చేయడానికి కారణం?
‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి ముందే ఇక నుంచి ప్రయాణం భిన్నంగా ఉండాలనుకున్నా. ‘ఇస్మార్ట్‌..’ తర్వాత కూడా మళ్లీ ప్రేమకథలు చేయాలనిపించలేదు. ‘రెడ్‌’ కథ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. ‘ఇస్మార్ట్‌...’ చూసి రామ్‌ ఇలా చేశాడేంటి? అని ప్రేక్షకులు షాక్‌ అయ్యారు. అలా ప్రతి సినిమాకీ షాక్‌ ఇస్తే బాగుంటుంది కదా (నవ్వుతూ).

నతో మనం గడపడం అవసరం. మనల్ని మనం ఆస్వాదించకపోతే  ఇంకెవ్వరినీ ప్రేమించలేం. ఒంటరిగా గడపడమంటే నాకు ఇష్టం. మొన్నటిదాకా కుటుంబంతోపాటే ఉండేవాణ్ని. ఈమధ్యే కొత్త ఇంట్లోకి మారాను. అక్కడ ఒక్కడినే ఉంటున్నాను. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చి వెళుతుంటారు. సినిమా పూర్తయ్యాక విదేశాలకి వెళుతుంటా. ఎక్కడికి వెళ్లాలనేది ముందుగా ప్లాన్‌ చేసుకోను. ఎయిర్‌పోర్ట్‌కి వెళుతూ వెళుతూ దారిలో ఏదో ఒక ప్రదేశం అనుకుని టికెట్లు బుక్‌ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా చేస్తున్నప్పుడు సినిమా తప్ప మరో విషయం గుర్తుండదు.

లుక్‌ పరంగానూ మీలో మార్పు కనిపిస్తోందే..?    
ప్రతి సినిమాలోనూ హీరో మంచివాడిగా కనిపిస్తుంటాడు. దాంతో మంచితనం అంటే చిరాకు వచ్చేసింది. ఒక నటుడిగా కంటే ప్రేక్షకుడిగా నాలో ఒక రకమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంతోనే పూరి జగన్నాథ్‌    దగ్గరికి వెళ్లా. ‘ఇప్పటిదాకా చేయందేదో చేయాలి మనం’ అని చెప్పా. ‘నువ్వు లవర్‌ బాయ్‌ కాదు, నువ్వు ఇదీ. నిన్ను ఎవ్వరూ అలా వాడలేదు, నేను వాడతా’ (నవ్వుతూ) అంటూ ఆయన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చేశారు.
పూరితో ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు?
ఆయనొక అద్భుతమైన దర్శకుడు. వ్యక్తిగా ఇంకా నచ్చుతారు. ఆయనలా బతకడం నేర్చుకుంటే చాలు. చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతుక్కుంటారు.

కిషోర్‌తిరుమలతో ఇది మీకు మూడో చిత్రం?  
దర్శకుడు కిషోర్‌ మా కుటుంబంలో ఒక భాగం. మా నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు చేశారు, రెండు  సినిమాలకి  రచయితగా పనిచేశారు. ‘నేను శైలజ’లో తను నన్ను కొత్తగా చూపించారు. ‘రెడ్‌’ రీమేక్‌ అయినా తన ఆలోచనలతో కొత్తగా తీర్చిదిద్దారు.
మీ సినీప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే ఏమనిపిస్తుంది?
నేను ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంటా. నేను బాగా ఆస్వాదించే కథల్ని ఎంపిక చేసుకునేవాణ్ని. నెమ్మదిగా అభిమాన గణం పెరిగింది కాబట్టి ఇప్పుడు నాతోపాటు వాళ్ల ఇష్టాల గురించి కూడా ఆలోచిస్తుంటా. ‘దేవదాస్‌’, ‘జగడం’ నుంచీ మాస్‌, క్లాస్‌ మేళవింపుగా సినిమాలు చేశాను. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో నన్ను ఆవిష్కరించడం నాకు బాగా సంతృప్తినిచ్చే విషయం.
పాన్‌ ఇండియా చిత్రాలు చేసే ఆలోచన ఉందా?  
హిందీలో డబ్‌ అయిన నా సినిమాలకు వరుసగా వంద మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. తమిళం నుంచి కూడా ఎప్పట్నుంచో అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పక్కాగా ఉంటుందనిపిస్తేనే పాన్‌ ఇండియా తరహా సినిమాలు చేస్తాను.

మీ పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది (నవ్వుతూ). ప్రేమ, పెళ్లి మన చేతుల్లో ఉండవు. కాబట్టి అవన్నీ జరగాల్సిన సమయం వస్తే జరిగిపోతాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని