గుండె కరిగింది... జోలె నిండింది!

రంగస్థలంపై రాణించి, మూకీ చిత్రాలతో రంగప్రవేశం చేసి, టాకీ చిత్రాల్లో స్టార్‌గా వెలుగొందిన మహానటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌.

Published : 06 May 2022 15:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రంగస్థలంపై రాణించి, మూకీ చిత్రాలతో రంగప్రవేశం చేసి, టాకీ చిత్రాల్లో స్టార్‌గా వెలుగొందిన మహానటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో సైతం ఆయన కన్నతల్లి లాంటి నాటకరంగాన్ని విస్మరించలేదు. ‘పృథ్వీ థియేటర్‌’ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి, బొంబాయిలో శాశ్వత ప్రదర్శనశాలను నిర్మించి, తన కుటుంబ సభ్యుల సహాయంతో క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శిస్తూ, సజీవ కళతో ప్రేక్షకులకు చేరువగా ఉండేవారాయన. అందుకు కావాల్సిన ఆర్థిక వనరుల కోసం పృథ్వీరాజ్‌ కపూర్‌ ప్రతి ప్రదర్శన తర్వాత తన బృందంతో పాటు జోలెతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి విరాళాలు అర్థించేవారు. ఓ రోజు ప్రదర్శన తర్వాత జోలెతో వచ్చిన ఆ మహానటుణ్ని చూసి ప్రేక్షకుల్లోని ఓ తెలుగు యువకుడు చలించిపోయాడు. అప్పుడప్పుడే తెలుగునాట రంగస్థలం మీద పేరు తెచ్చుకుంటున్న ఆ యువకుడు వెంటనే తన జేబులోని పర్సును బయటకు తీశాడు. అందులోని పూర్తి మొత్తాన్ని జోలెలో వేసి చెమ్మగిల్లిన కళ్లతో పృథ్వీరాజ్‌కపూర్‌కు నమస్కరించి, గంభీరంగా బయటపడ్డాడు. హోటల్‌ గదికి వచ్చి చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి జేబులో చిల్లి గవ్వ కూడా మిగల్లేదని ఆ యువకుడికి అర్థమయింది. చివరకు స్నేహితుడు ఆదుకోవడంతో ఎలాగో సొంతూరు చేరుకున్నాడు. అక్కడ కట్‌చేస్తే- అనంతర కాలంలో ఆయన మద్రాసు చేరుకున్నాడు. అవకాశాల కోసం తలుపు తట్టాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బు కరిగిపోవడంతో నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నాడు. చివరకు ఆ యువకుడి శ్రమ ఫలించింది. తెలుగు చలన చిత్రరంగం ఆయనకు ‘క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌’గా పట్టం కట్టింది. మోతాదు మించని హావభావాలకూ, స్పష్టమైన వాచకానికీ పేరెన్నికగన్న ఆ నటుడే గుమ్మడి వెంకటేశ్వరరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని