Renu Desai: విడాకులు తీసుకోవడం నేరం కాదు: రేణూ దేశాయ్‌ సుదీర్ఘ పోస్ట్‌

యూట్యూబ్‌లోని ఒక ఛానల్‌లో తనపై ఒక వ్యక్తి చేసిన కామెంట్లపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai). ఈ మేరకు ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 09 Dec 2023 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వదంతులు సృష్టించే పలువురిని ఉద్దేశిస్తూ సుదీర్ఘంగా పోస్ట్‌ పెట్టారు నటి రేణూ దేశాయ్‌ (Renu Desai). సెలబ్రిటీల జీవితాలపై ఫోకస్‌ చేయడం నిజమైన పాత్రికేయం కాదని ఆమె హితవు పలికారు. ‘‘ నటీనటులు, వాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం సమంజసమా? సమాజం, శాంతి భద్రతలకు సినీ తారల జీవితం విఘాతం కలిస్తుందా? సినిమా ఏదైనా విడుదలైనప్పుడు.. సినీ విశ్లేషకులు, విమర్శకులు ఆ చిత్రంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు. వాళ్ల అభిప్రాయాలను భావ ప్రకటన స్వేచ్ఛగా మేము భావిస్తుంటాం. కానీ, మా జీవితాల గురించి మాట్లాడటం మంచిది కాదు’’ అని ఆమె పోస్ట్‌ పెట్టారు.

ఆ హీరోతో ముద్దు సీన్స్‌.. చాలా ఇబ్బందిపడ్డా: బాలీవుడ్‌ నటి

‘‘యూట్యూబ్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కారణంగా ఖాళీగా కూర్చొన్న ప్రతి ఒక్కరూ మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోవడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక కలిగిన వ్యక్తులందరూ.. పుస్తకాలు, పాటలు రాయడం, పెయింటింగ్స్‌ గీయడం, సినిమాలు తెరకెక్కించడం మానేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సృజనాత్మక కలిగిన వ్యక్తులు ఎంతో సున్నితమైన వారు. నటన, సంగీతం, డ్యాన్స్‌, పెయింటింగ్స్‌ వేయడం ఇలా.. పలు విధాలుగా తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. అందరి మాదిరిగానే వ్యక్తిగత జీవితంలో మాక్కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రేమ పొందిన క్షణాలు, మనసు ముక్కలైన సందర్భాలూ ఉన్నాయి. మా జీవితాల్లో మేమూ కొన్ని తప్పులు చేస్తాం. అయితే, కొంతమంది మా బాధ నుంచి లబ్ధి పొందడం ఏమాత్రం నైతికత అనిపించుకోదు. బ్రేకప్‌ లేదా విడాకులు తీసుకోవడం నేరం కాదు. నా జీవితం గురించి నేనే స్వయంగా మాట్లాడటం అనేది పూర్తిగా నా ఇష్టం. కానీ, సెలబ్రిటీల జీవితాలపై కొంతమంది ఇలాంటి వదంతులు సృష్టించడం ఏమాత్రం గౌరవప్రదం అనిపించుకోదు. అలాంటి వదంతుల గురించి నేను వివరణ ఇచ్చుకోగలను. కానీ, నేను చెప్పాలనుకుంది మాత్రం ఒక్కటే. వేరేవాళ్లకు ఎదురైన సమస్యల గురించి మాట్లాడి డబ్బులు సంపాదించడం మంచి కర్మ కాదు’’ అని రేణూ తెలిపారు.

రేణూ దేశాయ్‌ ఈ విధమైన పోస్ట్‌ ఎందుకు పెట్టారంటే..

‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రేణూ దేశాయ్‌ నటిగా రీఎంట్రీ ఇవ్వడంపై ఇటీవల యూట్యూబ్‌లో ఒక వ్యక్తి మాట్లాడారు. అందులో ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన కామెంట్స్‌ చేశారు. సదరు దృశ్యాలను రేణూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో తాను సాధించిన విజయాలను గుర్తుచేశారు. మహిళలను తక్కువగా చూడడం తగదని చెప్పారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడటం సరికాదంటూ సుదీర్ఘంగా పోస్ట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని