కృష్ణ.. మహేశ్‌బాబు నుంచి నేను నేర్చుకున్నది అదే: అశోక్‌ గల్లా

తాతయ్య కృష్ణ నుంచి డేరింగ్ అండ్ డాషింగ్, మహేశ్‌ మామయ్య నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్ నెస్ వంటి లక్షణాలను నేర్చుకున్నానని అన్నారు అశోక్‌ గల్లా.

Published : 08 Jan 2022 22:15 IST

తాతయ్య కృష్ణ నుంచి డేరింగ్ అండ్ డాషింగ్, మహేశ్‌ మామయ్య నుంచి సెన్సాఫ్ హ్యూమర్, టాలెంట్, ఇంటెలిజెంట్, షార్ప్ నెస్ వంటి లక్షణాలను నేర్చుకున్నానని అన్నారు అశోక్‌ గల్లా. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’(Hero). నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అశోక్‌ గల్లా(Ashok Galla) ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

‘హీరో’ కథ ఎలా ఉండబోతోంది?

అశోక్‌ గల్లా: కథ గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ సినిమా చూసిన తర్వాత ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అని మీరంతా భావిస్తారు. కమర్షియల్ సినిమాను చేస్తున్నామని దర్శకుడు ముందే చెప్పారు. ఎక్కువగా చిరంజీవిగారి సినిమాలను రిఫరెన్స్‌గా ఇచ్చారు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి.. హీరో అవ్వాలని అనుకుంటాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడు మనమే తోపు అని అనుకునే క్యారెక్టర్‌.

దర్శకుడిగా శ్రీరామ్‌ ఆదిత్యనే ఎంచుకోవడానికి కారణం?

అశోక్‌ గల్లా: నేను శ్రీరామ్ ఆదిత్యని దర్శకుడిగా ఎంచుకోలేదు. మేం ఇద్దరం ఒకరినొకరు ఎంచుకున్నాం. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం. ఆయన నన్ను హీరోగా ఎంచుకోవడం నా అదృష్టం. శ్రీరామ్ సినిమాలు, ఆయన తెరకెక్కించే విధానం అన్నీ బాగుంటాయి.

‘హీరో’ కోసం ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

అశోక్‌ గల్లా: డ్యాన్స్, యాక్షన్‌లో ట్రైనింగ్ తీసుకున్నా. నాకు మామూలుగా అయితే యాక్టింగ్ అంటేనే ఇష్టం. స్వతహాగా నేను డ్యాన్సర్‌ని కాదు. జిమ్‌కు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి థియేటర్ ఆర్ట్స్ చేశాను. నాకు ఫిల్మ్ డిగ్రీ ఉంది.

అసలు మీకు సినిమాలపై ఎప్పుడు ఆసక్తి ఏర్పడింది?

అశోక్‌ గల్లా: ఏడెనిమిదేళ్ల వయసులో తాత ఓ సినిమాలో పెట్టారు. ఆ తర్వాత ‘నాని’లో కూడా నటించా. అప్పుడే నాకు సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది.సింగపూర్‌లో థియేటర్ క్లాస్‌లు చేస్తుంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యా.

‘హీరో’ సినిమాను కృష్ణ, మహేశ్‌ చూశారా?

అశోక్‌ గల్లా: ఇంకా సినిమా ఫైనల్ కాపీ రాలేదు. వచ్చాక కృష్ణ గారు, మహేష్ బాబు గారు చూస్తారు.

ఇందులో కౌబాయ్‌ గెటప్‌లో కనిపించినట్లు ఉన్నారు!

అశోక్‌ గల్లా: ఈ సినిమా కంటే ముందు నాకు గుర్రపు స్వారీ రాదు. కానీ షూటింగ్‌కు వెళ్లే నెల ముందు నేర్చుకుంటే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. దీంతో హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. అది ఛాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే, ఈ సినిమాలో జోకర్ పార్ట్ కొద్దిగా చేశారు. దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.

సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకొన్నారా?

అశోక్‌ గల్లా: సినిమా వాళ్ల జీవితం ఎలా ఉంటుందో అమ్మకు తెలుసు. జయాపజయాలు ఎప్పుడు పలకరిస్తాయో ఎవరికీ తెలియదు. ‘ఎత్తుపల్లాలుంటాయి అవసరమా?’ అని అమ్మ భయపడ్డారు. నాన్న కూడా అలానే అన్నారు. కానీ నేను ఒక్కసారిగా నా నిర్ణయం గట్టిగా చెప్పడంతో వారు కూడా సపోర్ట్ చేశారు.

మహేశ్‌బాబు ఏమైనా సలహాలు ఇచ్చారు?

అశోక్‌ గల్లా: నాకు నటనపై ఆసక్తి ఉందని మహేశ్‌బాబు గారికి ఎప్పటి నుంచో చెబుతూ వచ్చాను. కానీ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాని తెలియడంతో సీరియస్‌గానే చెప్పాడని అనుకున్నారు. ఇక్కడకు వస్తే ఎలా ఉండాలి.. ఎలా ధైర్యంగా ఉండాలి అనేదే ఎక్కువగా చెప్పారు.

నిధి అగర్వాల్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?

అశోక్‌ గల్లా: ఇలా చేస్తే ఏమైనా అనుకుంటుందా? అనే అవకాశాన్ని కూడా తను ఇవ్వలేదు. అందుకే సీన్స్, సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆమె చాలా ప్రొఫెషనల్. మా గ్యాంగ్‌లో కలిసిపోయింది.

మహేశ్‌ ఆరోగ్యం ఎలా ఉంది?

అశోక్‌ గల్లా: మహేశ్‌బాబు గారు ఇప్పుడే క్షేమంగానే ఉన్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్షేమంగా బయటకు వస్తారు.

ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

అశోక్‌ గల్లా: అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. దర్శకుడితో సింక్ అయినా, కథ, క్యారెక్టర్‌ కనెక్ట్ అయినా కూడా సినిమాను చేస్తా. నాకు టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి సినిమా అయితే ఇంకా బెటర్. ప్రస్తుతం కొన్ని కథలు వింటూ ఉన్నాను. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ఈ సంక్రాంతికి హీరో సినిమాతో మీకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని