Kamal Haasan: ‘విక్రమ్‌’ కోసం ‘బిగ్‌బాస్‌’కు దూరమైన కమల్‌హాసన్‌

తాను హోస్ట్‌గా వ్యవవహిరిస్తున్న ‘బిగ్‌బాస్‌ అల్టిమేట్‌’ (బిగ్‌బాస్‌ ఓటీటీ- తమిళం) కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు.

Published : 21 Feb 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బిగ్‌బాస్‌ అల్టిమేట్‌’ (బిగ్‌బాస్‌ ఓటీటీ- తమిళం) కార్యక్రమ హోస్ట్‌గా తాను తప్పుకున్నట్టు ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ప్రకటించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో నటిస్తున్న ‘విక్రమ్‌’ సినిమాను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ‘‘డిజిటల్‌ మాధ్యమంలో ‘బిగ్‌బాస్‌’ను ఆవిష్కరించటాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ షో నా హృదయానికి బాగా దగ్గరైంది. ఈ కార్యక్రమానికి బాగా కనెక్ట్‌ అయ్యా. ముందు నుంచీ ‘విక్రమ్‌’ చిత్రం, ‘బిగ్‌బాస్‌’ చిత్రీకరణకు సంబంధించిన షెడ్యూల్ని పక్కగా ప్లాన్‌ చేశాం. కానీ, కొవిడ్‌/లాక్‌డౌన్‌ కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అందరి షెడ్యూల్స్‌ మారాయి. ‘విక్రమ్‌’ సినిమా షూటింగ్‌ తుది దశలో ఉంది. ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణుల కాంబినేషన్‌లో వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కించాలి. ఒకవేళ అందరి డేట్స్‌ సర్దుబాటు అయ్యాక ‘బిగ్‌బాస్‌’ కారణంగా నేను షూటింగ్‌కు హాజరవకపోతే న్యాయంగా ఉండదు. మునుపటిలా ‘విక్రమ్‌’, ‘బిగ్‌బాస్‌’.. రెండిటినీ చూసుకోవటం కష్టం. అందుకే ప్రస్తుతానికి ‘బిగ్‌బాస్‌’ నుంచి వైదొలుగుతున్నా’’ అని కమల్‌ లేఖలో పేర్కొన్నారు.

బుల్లితెరపై పలు ‘బిగ్‌బాస్‌’ సీజన్లలో హోస్ట్‌గా అలరించిన కమల్‌హాసన్‌ తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. కమల్‌హాసన్‌ హీరోగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్‌ కనకరాజు తెరకెక్కిస్తున్న చిత్రమే ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని