Kangana Ranaut: ఎంత డబ్బిచ్చినా ఆ పని మాత్రం చేయను: కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా తాజాగా పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీల పెళ్లిల్లో డ్యాన్స్‌లు వేయడం గురించి ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు.

Published : 06 Mar 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనను తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు.

‘‘గాయని లతా మంగేష్కర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడను అని చెప్పారు. నేను అదే ఫాలో అవుతాను. నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, లతాజీ చెప్పిన ఆ మాటను మాత్రం నేను పాటిస్తూనే ఉన్నా. ఎన్ని ఆఫర్లు వచ్చినా పెళ్లిళ్లలో డ్యాన్స్ వేయలేదు. భారీ రెమ్యూనరేషన్‌ ఇస్తాం ఐటెమ్‌ సాంగ్స్‌ చేయమంటూ వచ్చిన అవకాశాలను కూడా తిరస్కరించాను. అవార్డు వేడుకలకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నా. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యం. అడ్డదారుల్లో డబ్బు సంపాదించకూడదని యువతరం అర్థం చేసుకోవాలి’’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం కంగనాను తప్పుపడుతున్నారు.

జాన్వీ కపూర్‌ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ తెలుసా..!

మరోవైపు కంగనా ఇటీవల నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ హీరో ఇమ్రాన్‌ హష్మీ ఖండించారు. ఈవిషయంపై ఆయన మాట్లాడుతూ.. ‘నటిగా కంగనా అంటే నాకు అభిమానం. బహుశా సినీ పరిశ్రమలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురై ఉండొచ్చు. అలా అని ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించడం సరైన పద్ధతి కాదు. నేను ఆమెతో కలిసి ‘గ్యాంగ్‌స్టర్‌’లో నటించాను. అందులో నాకంటే ఆమెదే ప్రధాన పాత్ర. ఆ సినిమాతో కంగనాకు మంచి గుర్తింపు వచ్చింది. అయినా నేనేం బాధపడలేదు. నెపోటిజం వల్లే అవకాశాలొస్తాయని, గుర్తింపు వస్తుందని నేను భావించను. ఈ విషయంలో కంగనా అభిప్రాయాన్ని అంగీకరించను. పరిశ్రమలో అందరూ ఒకేలా ఉంటారనుకోవడం తప్పు’ అని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు ‘తను వెడ్స్‌ మను పార్ట్‌ 3’ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని