Valimai: అజిత్‌, పవన్‌ కల్యాణ్‌ బాక్సాఫీసు తుప్పు వదిలిస్తారు: కార్తికేయ

‘వలిమై’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌. అజిత్‌, కార్తికేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది..

Published : 23 Feb 2022 01:30 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌, కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ బాక్సాఫీసు తుప్పు వదిలిస్తారని హీరో కార్తికేయ అన్నారు. అజిత్‌తో కలిసి కార్తికేయ నటించిన చిత్రం ‘వలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించింది.

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘నా ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం విడుదలకు ముందు స్నేహితుడితో కలిసి తమిళం సినిమా ‘ఖాకి’ చూశా. ఈ చిత్ర దర్శకుడు (హెచ్‌. వినోద్‌) నాతో సినిమా తీస్తానంటే స్క్రిప్టు వినకుండానే ఓకే చేస్తా అని అప్పుడే ఫిక్స్‌ అయ్యా. అనుకోకుండా ఆ అవకాశం ‘వలిమై’ రూపంలో వచ్చింది. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అజిత్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన తనకంటే నా గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించేవారు. పవన్‌ కల్యాణ్‌, అజిత్‌.. వీరిద్దరికీ విశేష అభిమానగణం ఉంది. సినిమాలపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ వీరిని ఎంతోమంది ఆరాధిస్తారు. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు ఒక్కరోజు తేడాతో విడువలవుతుండటం సినీ ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. ఇద్దరూ కలిసి బాక్సాఫీసు తుప్పును వదిలించేస్తారు. పవన్‌ కల్యాణ్‌, అజిత్‌ అభిమానిగా చెప్తున్నా..  24న ‘వలిమై’ చూడండి. 25న ‘భీమ్లా నాయక్‌’ చూడండి. 26 నుంచి రెండు సినిమాలను చూస్తూనే ఉండండి’’ అని అన్నారు.

నిర్మాత బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఉత్తరాదికి చెందినవాడినే కానీ దక్షిణాది అంటే ఎంతో ప్రేమ. బాపుగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ నేను హిందీలోకి రీమేక్‌ చేసిన తొలి చిత్రం. ‘హమ్‌ పాంచ్’ పేరుతో ఆ సినిమాను హిందీ ప్రేక్షకులకు అందించా. అజిత్‌తో నాకెప్పటి నుంచో పరిచయం ఉంది. అజిత్‌- దర్శకుడు వినోద్‌ కాంబినేషన్‌ ఎప్పుడూ అలరిస్తుంది. వారిద్దరూ చిత్ర బృందానికి స్ఫూర్తినిస్తుంటారు. అలాంటి వారితో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉంది. మా ముగ్గురి కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించాం. మేం కలిసి మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఆయన భార్య, దివంగత నటి శ్రీదేవిలానే కూతురు జాన్వీ కపూర్‌ అన్ని భాషల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉందని, సరైన కథ వస్తే తప్పకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని