
Dhanush Aishwarya: ధనుష్-ఐశ్వర్య విడిపోవడానికి అదే కారణం!
విడాకులపై స్పందించిన నటుడి తండ్రి కస్తూరి రాజా
చెన్నై: కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ విడాకుల విషయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు. ధనుష్-ఐశ్వర్యలను తిరిగి కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ కోలీవుడ్ పత్రికతో మాట్లాడారు. ‘‘భార్యాభర్తల మధ్య కలహాలు రావడం సర్వసాధారణం. అదే మాదిరిగా ధనుష్-ఐశ్వర్యల మధ్య కూడా చిన్న చిన్న కుటుంబ కలహాలు తలెత్తాయి. విడాకుల ప్రకటన వాళ్ల వ్యక్తిగత విషయం. వాళ్లకి నచ్చజెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం వాళ్లిద్దరూ చెన్నైలో లేరు. ‘సార్’ షూట్ కోసం ధనుష్ - ఐశ్వర్య హైదరాబాద్‌కు వెళ్లారు. విడాకుల ప్రకటనపై ఇప్పటికే వాళ్లిద్దరితో ఫోన్లో మాట్లాడాను. మరోసారి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తా’’ అని కస్తూరి రాజా వివరించారు.
కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్, హాలీవుడ్ల్లోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు ధనుష్. ఈ క్రమంలోనే ఆయన వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తిగత జీవితానికి కాస్త తక్కువగా సమయం కేటాయించాల్సి వచ్చిందట. ఈ విషయంపై ఇప్పటికే ధనుష్-ఐశ్వర్యల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని, దీంతో విడిపోవాలని గత కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకున్నారని.. పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.