Krithi Shetty: యాంకర్స్‌ అతి.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతిశెట్టి

సినీ పరిశ్రమపై ఉన్న ఇష్టంతో చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసి మొదటిసినిమాతోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబయి భామ కృతిశెట్టి. ‘ఉప్పెన’....

Updated : 07 Dec 2022 16:27 IST

వీడియో వైరల్‌.. నెటిజన్లు ఫైర్‌

చెన్నై: తొలి సినిమాతోనే స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ముంబయి భామ కృతిశెట్టి. ‘ఉప్పెన’ సక్సెస్‌తో కెరీర్‌లో స్పీడ్‌ పెంచిన ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ భామకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఇద్దరు యాంకర్స్‌ చేసిన అతికి లైవ్‌లోనే ఏడ్చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆ యాంకర్స్‌ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అసలేమైందంటే..

తాజాగా కృతి ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమెకు ‘ఉత్తమ నటి’గా అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం ఆమె ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్‌ పాల్గొనగా.. అందులో ఒకరు మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు కృతి నవ్వుతూ సమాధానాలు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరో యాంకర్‌.. ‘‘ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే.. ఇక నేను ఎందుకిక్కడ? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చొపెట్టారు? ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన దుస్తులు ఎందుకు? ఈ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఎవరు? కెమెరా ఆఫ్‌ చేయండి’ అంటూ కేకలు వేశాడు. దాంతో ఇద్దరు యాంకర్స్‌ వాగ్వాదానికి దిగారు. అది చూసిన కృతిశెట్టి షాకైంది. అనంతరం వాళ్లిద్దరూ కృతి దగ్గరకు వెళ్లి.. ఇది కేవలం ప్రాంక్‌ మాత్రమేనని.. కంగారు పడొద్దని చెప్పారు. ఆ మాటతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని.. స్టేజ్‌పైనే ఏడ్చేశారు. మిగతా టీమ్‌ మొత్తం సెట్‌లోకి వెళ్లి ఆమెను ఓదార్చారు. అనంతరం కాస్త తేరుకున్న ఆమె ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకెంతో భయమని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ ఇద్దరు యాంకర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదేం ప్రాంక్‌ అంటూ మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని