Mohanbabu: నా ఇంటికి ఎందరో వస్తారు.. ఆ విషయాన్ని తప్పుపడితే ఎలా: మోహన్‌బాబు

మోహన్‌బాబు ఇంటర్వ్యూ. ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలివీ..

Updated : 13 Feb 2022 21:08 IST

హైదరాబాద్‌: సుమారు మూడేళ్ల తర్వాత సినీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు మోహన్‌బాబు(Mohan babu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమా విశేషాలపై మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

సినిమానే ఊపిరి..

‘‘మొదటి నుంచీ సినిమానే నా ఊపిరిగా భావించా. మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనుకున్నా. ఇటీవల ఓసారి డైమండ్‌ రత్నబాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ కథ చెప్పారు. అది వినగానే నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. మూడేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా గురువుగారు దాసరి నారాయణరావు నటుడిగానూ ఎన్నో ప్రయోగాలు చేశారు. నేనూ ఆయనలా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశా. ఇది చెడ్డ సినిమా కాదు. సినిమా అందరికీ నచ్చుతుందా? లేదా? సక్సెస్‌ అవుతుందా? లేదా? అనేది చెప్పలేకపోవచ్చు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది మంచి చిత్రమని తప్పకుండా ఫీల్‌ అవుతారు’’

కథ డిమాండ్‌ మేరకు..

‘‘కథ డిమాండ్‌ చేయడం వల్ల ఈ సినిమాలో అమ్మాయిల మధ్య ముద్దు సీన్లు పెట్టాల్సి వచ్చింది. విష్ణు దానికి ఒప్పుకోలేకపోయాడు. ‘డాడీ మనకి సొసైటీలో మంచి పేరు ఉంది. విద్యాసంస్థలు నడుపుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ సీన్లు పెడితే బాగోదేమో’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. నా ప్రవర్తన సరిగా లేని రోజున నేను మనిషిగా జీవించడానికి అనర్హుడ్ని. నేనేంటో అందరికీ తెలుసు. కాబట్టి, కథ డిమాండ్‌ చేసింది కాబట్టే వాటిని ఓకే చేశాం. అందరికీ అది తప్పకుండా అర్థమవుతుందని చెప్పా’’.

‘‘ఓ మంచి వ్యక్తి.. ఎమ్మెల్యే వల్ల ఎలా నాశనం అయ్యాడు. చేయని తప్పునకు జైలుకి ఎలా వెళ్లాడు. అతడినే నమ్ముకున్న భార్యాపిల్లలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అనే కథాంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ అంశంపై విశ్లేషణ చేస్తే.. భారతదేశంలో అన్యాయంగా జైల్లో జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారని తెలిసింది. రఘువీర గద్యాన్ని కావాలని ఈ సినిమాలో ఒక పాటగా వాడాం. దాని చిత్రీకరణ, గ్రాఫిక్స్‌ కోసం సుమారు రూ. కోటిన్నర ఖర్చు చేశాం. సినిమాలో ఆ గద్యాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఐదారుగురు సింగర్స్‌తో దాన్ని పాడించాం. కానీ, ఇళయరాజాకి నాకూ వాళ్ల వాయిస్‌ నచ్చలేదు. చివరికి మలయాళీ సింగర్‌ రాహుల్‌ నంబియార్‌ దీన్ని ఆలపించారు’’.

మంచి సినిమా అనుకునేలా..

‘‘సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు. వాటిని రహస్యంగానే ఉంచాలనుకుంటున్నా. ఇందులో ఎవరెవరు నటించారు? ఏ పాత్రలు పోషించారు అనేది నేను ఇప్పుడే చెప్పను. అందరూ మంచి పాత్రలు పోషించారు. గత సినిమాల అనుభవం కారణంగా సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందని గంటాపథంగా చెప్పను. కానీ, ‘మోహన్‌బాబు మంచి సినిమా చేశారు’ అని అందరూ అనుకుంటారు. సక్సెస్‌ అయితే మంచి సక్సెస్‌ అవుతుంది. లేదంటే లేదు. దానికీ సిద్ధమయ్యా. సెన్సార్‌ చేసినప్పుడు కేవలం కొన్ని పదాలను మాత్రమే మ్యూట్‌ చేశారు’’.

‘‘ఈ సినిమా పూర్తి నిడివి గంటన్నర మాత్రమే. మొదట ఓటీటీ కోసం అనుకున్నాం. అందుకు అనుగుణంగానే ముద్దు సన్నివేశాలు ఎక్కువ పెట్టాం. కాకపోతే తర్వాత దీన్ని థియేటర్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సెన్సార్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలు తొలగించాం. ఓటీటీలో విడుదల చేసే సమయంలో తొలగించిన సన్నివేశాలన్నింటినీ మళ్లీ యాడ్‌ చేసి ప్రసారం చేస్తాం. ప్రైవేటు జైలు అనే కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించాం. ఇది నిజజీవిత కథ అని చెప్పను. కానీ, రియల్‌లైఫ్‌లో మనం ఇలాంటి కథలను ఎన్నో చూస్తుంటాం’’.

అదే నా భయం..

‘‘దర్శకత్వం చేయాలని రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేసి పెట్టా. కానీ, రోజూ ఎవరో ఒకర్ని కొడతానని భయం. ఎందుకంటే నటీనటులు ఆలస్యంగా వచ్చినా, వెంటనే కారవ్యాన్‌లోకి వెళ్లినా నేను కోప్పడతాను. మా రోజుల్లో ఔట్‌డోర్‌ షూట్‌కి వెళ్తే కారవ్యాన్‌ ఉండేది కాదు. అందరూ ఇబ్బందిపడేవాళ్లం. నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రాయలసీమ వాడు సినిమాకి పనికిరాడు అన్నారు. రాయలసీమ వారికి భాష తెలియదు అన్నారు. ఆ సమయంలో అన్నయ్య రామారావు సినిమాలు చూశా. ఆయన డైలాగ్‌లు విని భాష నేర్చుకున్నా. ఆ తర్వాత గురువుగారు దాసరినారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నా’’.

‘‘నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. నా ప్రయాణం సాఫీగా సాగలేదు. రాయలసీమలోని ఓ పల్లెటూరులో పుట్టా. ఆకలి నుంచే నాకు కోపం వచ్చింది. నేను కోపానికే బానిసయ్యా. నాకోపం నాకే నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నా జీవితకథతో పుస్తకం రాస్తున్నా. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తా. నా బయోపిక్‌ గురించి ఎలాంటి ఆలోచనా లేదు. అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలకీ ఎంతో తేడా ఉంది. రాజకీయం మారిపోయింది. ఒకప్పుడు రాజకీయాల్లో ఉంటే గొప్పవాడు అనేవారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే చులకనగా చూస్తున్నారు. ప్రత్యక్షరాజకీయాల్లోకి రాను’’.

దాన్ని తప్పుపడితే ఎలా?

‘‘నా ఇంటికి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు.. ఇలా ఎంతోమంది అతిథులుగా వస్తుంటారు. వారు పిలిస్తే నేనూ వెళ్తుంటా. అలాంటిది మంత్రి పేర్నినాని మా ఇంటికి అతిథిగా వస్తే రకరకాల వార్తలొచ్చాయి. ఓ వివాహానికి హైదరాబాద్‌ విచ్చేసిన ఆయన్ను బ్రేక్‌ఫాస్ట్‌కి రమ్మని ఆహ్వానించా. దాన్ని తప్పుపడితే ఎలా? ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారు ఏం అన్నారు? మా సినిమా వాళ్లు ఏం మాట్లాడారు? అని నేను ఆయన్ను అడగలేదు. ఏదో సరదాగా మాట్లాడుకున్నాం. ఆయనకు శాలువా కప్పాం. ఆ ఫొటోని పంచుకుంటూ విష్ణు ట్వీట్‌ చేశాడు. టికెట్‌ ధరల విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడదలచుకోలేదు. దాని గురించి ఎప్పుడో చెప్పా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని