Swathi: ఆ వార్తల వల్ల నేనెంతో బాధపడ్డా: స్వాతి

‘మంత్‌ ఆఫ్‌ మధు’ ప్రెస్‌మీట్‌లో భాగంగా తన గురించి వచ్చిన పలు కథనాలను ఉద్దేశించి స్వాతి మాట్లాడారు.

Updated : 07 Oct 2023 21:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతి (Swathi), నవీన్‌ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మంత్ ఆఫ్‌ మధు’ (Month Of Madhu). శ్రీకాంత్‌ నాగోతి దర్శకుడు. అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో సినిమా రివ్యూలు రాసే పలువురు వ్యక్తులపై దర్శకుడు శ్రీకాంత్‌ అసహనం వ్యక్తం చేశారు.

వెబ్‌సిరీస్‌ మాదిరిగా మీ చిత్రాన్ని వివిధ భాగాలుగా చూపించారు కదా. సినిమాకు అదేమైనా మైనస్‌ అయ్యిందని అనుకుంటున్నారా?

శ్రీకాంత్‌: అలా ఏమీ లేదు. ఒకవేళ మళ్లీ నాకు అవకాశం ఇచ్చి ఈ చిత్రాన్ని ఎడిట్‌ చేయమని కోరితే ఒక్క ఫ్రేమ్‌ కూడా మార్చను. ఎందుకంటే, ఒక మంచి ఆలోచనతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రతీది ఒక కారణంతో ఎడిట్‌ చేశాం. ప్రతిచోటా లాజిక్‌ ఉంది. అర్థం చేసుకుని సినిమా చూస్తే తప్పకుండా మనసుని హత్తుకుంటుంది.

థియేటర్ల సంఖ్య పెంచే అవకాశం వస్తుందా?

శ్రీకాంత్‌: కొత్త సినిమాటిక్‌ అనుభవాన్ని అందించడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. విడుదలైన రోజుతో పోలిస్తే నేడు థియేటర్ల సంఖ్యలో కాస్త మార్పు ఉంది. ప్రేక్షకుల మాటలతోనే ఈ సినిమా అందరికీ రీచ్‌ కావాలని నేను కోరుకుంటున్నా.

ప్రేక్షకుల నుంచి మీ పాత్రకు ఎలాంటి రియాక్షన్‌ వస్తుంది?

నవీన్‌ చంద్ర: సినిమాలో నేను పోషించిన మధుసూదనరావు పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ చూసి నేను ఎంతో ఆనందిస్తున్నా. నిన్న థియేటర్స్‌ విజిట్‌కు వెళ్లా. సినిమా పూర్తైన వెంటనే కొంతమంది నా వద్దకు వచ్చి గట్టిగా హగ్‌ చేసుకున్నారు. వాళ్ల రియాక్షన్‌ చూసి నాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ చూడాలి.

Varuntej-Lavanya: చిరంజీవి నివాసంలో మొదలైన ప్రీవెడ్డింగ్‌ వేడుకలు.. ఫొటోలు వైరల్‌

క్లైమాక్స్‌ సడెన్‌గా ముగిసినట్టు ఉంది? పార్ట్‌ 2 ఏమైనా ఉందా?

శ్రీకాంత్‌: పార్ట్‌ 2 చేయాలనే ఆలోచన నాకేమీ లేదు. మరో విషయం ఏమిటంటే.. మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్‌ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. వాటి నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ, కొంతమంది విమర్శలు చేస్తూ రాశారు. నేను చెప్పేది ఒక్కటే.. లైఫ్‌కి ఎవరైతే ఓపెన్‌గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటివాళ్లు దయచేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా.

‘సోల్‌ ఆఫ్‌ సత్య’, ‘మంత్‌ ఆఫ్‌ మధు’ వంటి ప్రాజెక్ట్‌లు ఓకే చేయడానికి కారణం ఏమిటి?

స్వాతి: ‘సోల్‌ ఆఫ్‌ సత్య’ మీరింకా పూర్తిగా చూడలేదండి. కేవలం పాట మాత్రమే చూశారు. దాని క్లైమాక్స్‌.. మా సినిమా క్లైమాక్స్‌లాగే అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటిలో నా లుక్స్‌ ఒకేలా ఉండటం చూసి రెండూ ఒకేలాంటి సినిమాలు అనుకుంటున్నారేమో. లేఖ, సత్య పాత్రల మధ్య ఎంతో తేడా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేసినందుకు నేను గర్వపడుతున్నా. వ్యక్తిగతంగా నేను ఎంతో వృద్ధి చెందా. అయితే, కొంతమంది జర్నలిస్ట్‌లు నా గురించి రాసిన వార్తలు చూసి నేనెంతో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి కుమిలిపోయా. ఆ కథనాలు చదివిన వాళ్లు అదే నిజం అనుకున్నారు. నన్ను నమ్మలేదు. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. అది నా వృత్తి. అంతేకానీ, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసినట్టు రాస్తే తట్టుకోవడం కష్టం కదా!

అప్పుడు ‘అమ్ము’ ఇప్పుడు ‘మంత్‌ ఆఫ్‌ మధు’.. ఇలాంటి సినిమాలు ఎంచుకోవడానికి కారణం ఏమిటి?

నవీన్‌ చంద్ర: ఇలాంటి పాత్రల్లో లైఫ్‌ ఉంటుంది. రియాలిటీకి దగ్గర ఉండే పాత్రలివి. శ్రీకాంత్‌ ఈ సినిమా ఆఫర్‌ తీసుకువచ్చినప్పుడు తప్పకుండా యాక్ట్‌ చేయాలనిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని