nithiin: ఎక్స్‌ట్రా... నాకెంతో ప్రత్యేకం!

‘‘మొత్తంగా నా సినిమా కెరీర్‌లోనే అత్యుత్తమ పాత్రని ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’లో చేశా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు నితిన్‌.

Updated : 06 Dec 2023 09:38 IST

 కథానాయకుడు నితిన్‌

‘‘మొత్తంగా నా సినిమా కెరీర్‌లోనే అత్యుత్తమ పాత్రని ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’లో చేశా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా... వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల కథానాయిక. ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్‌ ఓ కీలక పాత్రని పోషించారు. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పకులు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. నితిన్‌ మాట్లాడుతూ ‘‘ఇంతవరకూ చేయని ఓ విభిన్నమైన  పాత్రని ఇందులో చేశా. ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. దర్శకుడికీ, నాకూ ఈ చిత్రం చాలా ముఖ్యం. ప్రేక్షకులు కాలర్‌ ఎగరేసుకుంటూ బయటికొస్తారు. అంత నమ్మకంగా ఉన్నా. రాజశేఖర్‌ సర్‌ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాలో నేను ఎక్స్‌ట్రార్డినరీ మేన్‌ కానీ, నిజ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ ఉమెన్‌ అంటే శ్రీలీల. ఆమెలో అంత ప్రతిభ ఉంద’’న్నారు. శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. నితిన్‌తో నటించడం మంచి అనుభవం’’ అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాం. వాళ్ల నవ్వు చూడటానికి ఏమైనా చేస్తాం. రెండున్నర గంటలపాటు కుటుంబం అంతటినీ మా సినిమాతో నవ్విస్తాం’’అన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘నాకు బాగా నచ్చిన పాత్రని చేశా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత, అభిషేక్‌ అగర్వాల్‌, వివేక్‌ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని