Nithya Menon: తెలుగు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా నిత్యామేనన్‌

నటి నిత్యామేనన్‌ (Nithya Menon) టీచర్‌గా మారారు. ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పాఠాలు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Published : 19 Jan 2023 11:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారారు నటి నిత్యామేనన్ (Nithya Menon)‌. అక్కడి చిన్నారులకు పాఠాలు చెప్పారు. అయితే, ఇదంతా షూటింగ్‌ కోసం మాత్రం కాదు. నిజంగానే జరిగింది. అదెలా అంటే..

తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి నిత్యామేనన్‌. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేశారు. షూట్‌ పూర్తైన వెంటనే.. లొకేషన్‌కు దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు ఆమె వెళ్లారు. అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం ఆ పిల్లలకు ఆంగ్ల పాఠాలు బోధించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులోనూ వాటిని వివరించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో నా న్యూ ఇయర్‌ డే ఇలా గడిచింది. గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఆనందంతో గడుపుతారు. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ సంతోషంగా ఉంటాను’’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘నిత్య చాలా చక్కగా తెలుగు మాట్లాడుతోంది’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణాపురం అనే గ్రామం ఉంది. దానివల్ల ఆమె ఏ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పింది అనేది తెలియరాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని