Pooja Bhalekar: నటనవైపు వస్తానని అనుకోలేదు

‘‘అమ్మాయిలకి మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా అవసరం. ఈ సినిమాతో కొంతమందికైనా అవగాహన కలిగి...  నేర్చుకుంటారనే నమ్మకం ఉంది’’ అన్నారు పూజా భాలేకర్‌. పుణెలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మార్షల్‌ ఆర్టిస్ట్‌గా ప్రావీణ్యం ప్రదర్శిస్తోంది.

Updated : 14 Jul 2022 07:52 IST

‘‘అమ్మాయిలకి మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా అవసరం. ఈ సినిమాతో కొంతమందికైనా అవగాహన కలిగి...  నేర్చుకుంటారనే నమ్మకం ఉంది’’ అన్నారు పూజా భాలేకర్‌ (Pooja Bhalekar). పుణెలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మార్షల్‌ ఆర్టిస్ట్‌గా ప్రావీణ్యం ప్రదర్శిస్తోంది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచింది. రామ్‌గోపాల్‌ వర్మ(RGV) దృష్టిలో పడి ‘అమ్మాయి’ (Ammayi) చిత్రంతో నటిగా మారింది. భారతీయ తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాగా రూపొందిన ‘అమ్మాయి’  శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా పూజా భాలేకర్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘‘నటనవైపు వస్తానని కలలో కూడా అనుకోలేదు. చిన్నతనం నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌పై దృష్టిపెట్టా. మొదట యోగా చేశా. ఆ తర్వాత అథ్లెట్‌గా మారా. స్కూల్‌లో చిన్న పిల్లలు మార్షల్‌ ఆర్ట్స్‌ చేయడం చూసి నేనూ నేర్చుకోవాలనుకున్నా. మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ సమయంలో నాకు ఈ విద్యల ప్రాముఖ్యత తెలియదు. ఇదే నా కెరీర్‌ అయ్యింది. ఈ సినిమాతో మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాధాన్యం, దాని గొప్పదనం చెప్పే అవకాశం నాకు లభించడం చాలా తృప్తినిచ్చింది’’.

‘‘రామ్‌గోపాల్‌ వర్మకి అభిమానిని నేను. ఆయన నుంచి ఫోన్‌ రాగానే మా నాన్నతో కలిసి ముంబయిలోని ఆయన కార్యాలయానికి వెళ్లా. బ్రూస్‌లీకి నివాళిగా ఈ సినిమా తీస్తున్న విషయం నాకు     తెలియదు. నా ఎంపిక పూర్తయ్యాక బ్రూస్‌లీ(Bruce Lee) గురించి చెప్పారు. సినిమాలో నేను బ్రూస్‌లీని ఇష్టపడే అమ్మాయిగా కనిపిస్తా. సినిమాలో నా పాత్ర పేరు పూజా కానిక్‌. నేను వర్మని కలవడం కంటే ముందే ఆ పాత్రకి ఆ పేరు పెట్టారట. విధి అంటే ఇదేనేమో అనిపించింది’’.

‘‘నా ఫిట్‌నెస్‌, నా బలం, నాకు తెలిసిన మార్షల్‌ ఆర్ట్స్‌... ఇవన్నీ ఈ చిత్రం చేయడానికి చాలా దోహదం చేశాయి. నాకున్న ప్రతిభని ఉపయోగించుకుంటూ ఇక సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. ట్రైలర్‌ విడుదలైన వెంటనే చాలా మంది నన్ను కొత్త కథలతో సంప్రదించారు’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని