యాపిల్‌ యూజర్స్‌కి ఈ యాప్‌ గురించి తెలుసా!

ఐఫోన్‌, ఐప్యాడ్‌ లాంటి ఆపిల్‌ ప్రొడెక్ట్స్‌ వాడే వారికి సైతం పూర్తిగా తెలియని ఓ గొప్ప, అద్భుతమైన యాప్‌ గురించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియజేశారు. తాజాగా ఆయన పూరీ...

Published : 14 May 2021 18:13 IST

ప్రారంభమై 14 ఏళ్లైనా ప్రమోట్ కానీ బెస్ట్‌ యాప్‌

హైదరాబాద్‌: ఐఫోన్‌, ఐప్యాడ్‌ లాంటి యాపిల్‌ ఉత్పత్తులు వాడే వారికి సైతం పూర్తిగా తెలియని ఓ గొప్ప, అద్భుతమైన యాప్‌ గురించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలియజేశారు. తాజాగా ఆయన పూరీ మ్యూజింగ్స్‌ వేదికగా ‘ఐట్యూన్స్‌ యూ’ అనే యాప్‌ గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ప్రపంచంలోనే పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఆ యాప్‌ ద్వారా ఎంతో విజ్ఞానాన్ని ఉచితంగా సంపాదించుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా అందర్నీ ఒక్కసారైనా ఆ యాప్‌ ఓపెన్‌ చేయమని సూచించారు.

‘‘మనలో చాలామంది ఐఫోన్‌ లేదా ఐప్యాడ్‌ లాంటి యాపిల్‌ ప్రొడెక్ట్స్‌ వాడతారు. అయితే ఇన్నేళ్ల నుంచి ఐఫోన్‌ లేదా ఐప్యాడ్‌ వాడుతున్నప్పటికీ మనం పట్టించుకోని, కనీసం కన్నెత్తి కూడా చూడని ఓ యాప్‌ ఉంది. ఆపిల్‌ వాడే జనాభాలో కనీసం ఒక్కశాతం మంది కూడా దాన్ని ఎప్పుడూ ఓపెన్‌ చేసి ఉండరు. దాని పేరు ‘ఐ ట్యూన్స్‌ యూ’. నిజానికి అది ఒక అద్భుతం. అందులో ఎంతో విజ్ఞానాన్ని అందించే విశేషాలు ఉన్నాయి. హార్వర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌, కొలంబియా యూనివర్సిటీ, ఆక్స్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పారిస్‌ ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, అన్ని కోర్సులు కూడా అందులో అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఉచితంగానే’’

‘‘హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్‌, ఫైనాన్స్‌, జర్నలిజం, బిజినెస్‌.. మీకు ఏది కావాలంటే ఆ టాపిక్‌, ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీలో ఆ కోర్సు మీరు చదువుకోవచ్చు. చదువుకోవడమే కాదు విజువల్‌గా చూడొచ్చు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రాచీన ఈజిప్ట్‌ల కళ, పురావస్తు శాస్త్రం అని టైప్‌ చేస్తే ఆ యూనివర్సిటీలో అక్కడ ప్రొఫెసర్‌ ఏం చెబుతున్నారో ఆ క్లాస్‌రూమ్‌ వీడియో మీకు వస్తుంది. మొబైల్‌ ద్వారా ఆ వీడియోని టీవీకి కనెక్ట్‌ చేసి చూస్తే మీరూ ఆ క్లాస్‌లో ఉన్నట్లే. యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనాకు వెళ్లాల్సిన పనిలేదు. ‘వాట్‌ మేక్స్‌ అస్‌ హ్యుమన్‌’ అని అడగండి ప్రిమిటాలజిస్ట్‌ జేన్‌ గుడాల్‌ మీ ముందు కనిపిస్తుంది. మీరు ఆమె క్లాస్‌లో ఉన్నట్లే. మీకు నచ్చిన క్లాస్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని మీరు మళ్లీ మళ్లీ వినే అవకాశం కూడా ఇందులో ఉంది’’

‘‘లెక్కలేనంత విజ్ఞానాన్ని అందించే యాప్‌ ‘ఐట్యూన్స్‌ యూ’. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను తీసుకువచ్చి మీ మొబైల్‌లో పెట్టారు. కానీ మనం వాడం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎలాగో కాలేజీలకు వెళ్లరు. కాబట్టి ఈ యాప్‌ ఓపెన్‌ చేయండి. ఏ యూనివర్సిటీలో ఏం చెబుతున్నారో వినండి. ఇందులో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. ఇంట్లో కూర్చొని నేర్చుకోండి. న్యూయార్క్ వెళ్లాల్సిన పనేలేదు. ఇంతటి విలువైన యాప్‌ని యాపిల్‌ ఎప్పుడూ ప్రమోట్‌ చేయలేదు. ప్రపంచంలోని ఏ మీడియా కూడా కవర్‌ చేయలేదు. నాకోసం ఒక్కసారి ‘ఐట్యూన్స్‌ యూ’ ఓపెన్‌ చేయండి. అనాటమీ, ఫిజియోలజీ లేదా మీకు ఇష్టమైన ఏదైనా క్లాస్‌ గురించి అడగండి. మీ హోమ్‌ థియేటర్‌కి కనెక్ట్‌ చేయండి. మీరు ఇంకా ఆ యూనివర్సిటీలో ఉన్నట్లే. 2007లో ఈ యాప్‌ని ప్రారంభించారు. 2021 వచ్చింది దాని గురించి ఎవ్వరికీ తెలీదు. ఎవరూ వాడకపోతే ఆపిల్‌ వాళ్లు ఆ యాప్‌ని తొలగించేస్తారు. కాబట్టి దయచేసి ‘ఐట్యూన్స్‌ యూ’ వాడండి’’ అని పూరీ వివరించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని