Published : 21 Apr 2022 01:56 IST

Acharya: నాన్నా నేనూ కలిసి నటించడానికి ముఖ్య కారణం ఆమే: రామ్‌చరణ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకులు, తండ్రీకొడుకులు రామ్‌చరణ్‌, చిరంజీవి అతిథి పాత్రల్లో కాకుండా పూర్తిస్థాయిలో కలిసి నటిస్తే బాగుంటుందని చాలామంది కాంక్షించారు. వారిలో చిరంజీవి భార్య సురేఖ ఒకరు. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో చరణ్‌ బిజీగా ఉన్నా ‘ఆచార్య’లో నటించేలా చేశారు. ఆమె రచించిన ప్రణాళిక ఏంటి? పాత్ర కోసం రామ్‌చరణ్‌ ఎలా సన్నద్ధమయ్యారు? తదితర ఆసక్తికర విశేషాలతో సాగే ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో దర్శకుడు కొరటాల శివ, రామ్‌చరణ్‌ పంచుకున్న సంగతులివీ..

* ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ను చూపించడానికి కారణమేంటి?

కొరటాల శివ: చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘ఆచార్య’ కథ రాశా. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం స్టార్‌డమ్‌ ఉన్న నటుడ్ని తీసుకోవాలనుకున్నా. గురుకులంలో పెరిగిన అబ్బాయి క్యారెక్టర్‌ అది. ఇమేజ్‌ ఉన్న హీరో పోషిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించా. చరణ్‌ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. గురుకులం విద్యార్థిలా అనిపిస్తారు. అందుకే ఈ సినిమాలోని పాత్రకు ఆయన్ను తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యా. ఆ సమయంలో.. ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బిజీగా ఉంటారేమో అనే సందేహంలోనే నా మనసులో మాట చెప్పా. సినిమాలో నటించేందుకు తను వెంటనే ఓకే చెప్పారు. ‘ఎంత కష్టమైనా తప్పకుండా చేద్దాం’ అని అన్నారు.

* ఈ చిత్రానికి నిర్మాతగా మీరెందుకు వ్యవహరించాలనుకున్నారు?

రామ్‌చరణ్‌: కొరటాల శివ.. నాన్నకు కథ చెప్పినప్పుడే ఈ సినిమాను నేను నిర్మించాలనుకున్నా. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉండటంతో నిర్మాత నిరంజన్‌తో చేతులు కలిపా. ఆయన గతంలో నాతో ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడిలా సాధ్యమైంది.

* చిత్రీకరణ అనుభవాల గురించి చెప్తారా?

రామ్‌చరణ్‌: కొత్తింటి నిర్మాణం దృష్ట్యా గత నాలుగేళ్లుగా నాన్నా నేనూ వేర్వేరుగా ఉంటున్నాం. ఆదివారం, ప్రత్యేకమైన రోజుల్లో కలుసుకుంటుంటాం. ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం సుమారు 18 రోజులు ఒకే ఇంట్లో ఉన్నాం. ఒకే సమయానికి లేవడం, కసరత్తులు, భోజనం.. ఇలా ప్రతిదీ కలిసే చేసేవాళ్లం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలవి. ‘ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ‘ఆచార్య’ రూపంలో మనకిప్పుడు వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్‌ చేద్దాం’ అని నాన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.

* చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేయాలన్నప్పుడు ఏం ఫీలయ్యారు?

రామ్‌చరణ్‌: ఆయనతో కలిసి డ్యాన్స్‌ అనగానే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. చెమట పట్టేది. ఆ భయం బయటకు కనిపించకుండా మేనేజ్‌ చేశా. విశేషం ఏంటంటే.. మేం డ్యాన్స్‌ చేసేటప్పుడు మా అమ్మ, నానమ్మ సెట్‌కు వచ్చారు. ‘నా కొడుకు బాగా చేస్తున్నాడంటే లేదు నా కొడుకు’ అంటూ ఇద్దరు సరదాగా గొడవ పడేవారు.

* ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ ఒకేసారి రెండింటిలో నటించేందుకు ఎలా సన్నద్ధమయ్యారు?

రామ్‌చరణ్‌: నాన్నా నేనూ పూర్తిస్థాయిలో తెరను పంచుకోవాలనేది మా అమ్మ కోరిక. ఆవిడ బలమైన కాంక్ష వల్లే ఇది సాధ్యమైంది. డేట్స్‌ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దర్శకుడు రాజమౌళితో మాట్లాడమని నాన్నను కోరింది. అలా.. కాల్షీటు వెసులుబాటు కల్పించిన రాజమౌళికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండు సినిమాల్లోని పాత్రలకు పోలిక ఉండదు. అలా అని మేం దీనికోసం పెద్ద కష్టపడిందీ లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విరామ సమయంలో నా లుక్‌కు శివ కొంచెం మెరుగులు దిద్దారు. అది ‘ఆచార్య’లోని పాత్రకు బాగా సెట్‌ అయింది.

* పూజాహెగ్డేతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

రామ్‌చరణ్‌: తను గొప్ప నటి అనే విషయం తెలిసిందే. ఆమె ఇతర ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నా ఈ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చింది.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని