Ram Charan: అందుకే మా ఇంట్లో నాన్న సినిమా ఫొటోలు తక్కువ ఉంటాయి..: రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Published : 09 Mar 2023 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆస్కార్‌ ఈవెంట్‌ కోసం అక్కడకు వెళ్లిన చరణ్‌.. అక్కడి మీడియాతో మాట్లాడారు.  రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.  అలాగే మెగాస్టార్‌ చిరంజీవిపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘‘ప్రస్తుతం భారతీయ చలనచిత్రం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఇది అందరికీ ఎంతో ఆనందమైన విషయం.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) హిట్ అవుతుందని అందరం అనుకున్నాం. కానీ మా ఊహకు మించి ఈ చిత్రం విజయం సాధించింది. విడుదలై సంవత్సరం అవుతున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా నాకు గొప్ప అనుభూతినిచ్చింది. రాజమౌళి (Rajamouli) భారతదేశానికి చెందిన స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌.  ఆయన దర్శకత్వంలో పనిచెయ్యాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒక దర్శకుడిగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. నాకు ఆయనంటే ఎంతో గౌరవం, ఇష్టం. ఆయన ఆర్టిస్టులకు ఎంతో స్వేచ్ఛనిస్తారు. అలా చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు. సినిమాలోని పాత్రలను స్టడీ చెయ్యడం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. కొవిడ్‌ సమయంలో నాకు ఫోన్‌ చేసి ‘రామ్‌ ఎలా ఉన్నావు’ అని అడిగారు. నేను మాములుగా ఫోన్‌ చేశారేమో అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది.. నేను జిమ్‌ చేస్తున్నానా.. లేదా? అని కనుక్కోవడానికి చేశారని’’ అంటూ రాజమౌళిని ప్రశంసించారు. 

ఇక చిరంజీవి గురించి రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ..‘‘మేమంతా కలిసినప్పుడు సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోము. మా నాన్న ఇంట్లో చాలా సాధారణంగా ఉంటారు. అందుకే మా ఇంట్లో నాన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు చాలా తక్కువ ఉంటాయి’’ అని చెప్పారు. ఇక మరోవైపు రామ్‌ చరణ్‌ ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. తాను హాలీవుడ్‌ ప్రాజెక్టులో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా  ప్రకటించనున్నట్లు తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు