Rana: ప్రభాస్‌ ఎవరో తెలియదు.. కానీ, చిన్ను భర్త తెలుసని చెప్పారు: రానా

హీరో రానా త్వరలోనే ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్‌ సిరీస్‌తో పలకరించనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బాహుబలి’ (Baahubali) సినిమా కంటే ముందు జరిగిన సంఘటన గురించి తెలిపాడు.

Published : 03 Mar 2023 19:28 IST

హైదరాబాద్‌: రానా (Rana) కీలక పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి నటించిన ఈ వెబ్‌సిరీస్‌ మార్చి10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ‘బాహుబలి’ (Baahubali) సినిమాకు ముందు జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో దక్షిణాదికి చెందిన అగ్రహీరోల పేర్లు ఇతర రాష్ట్రాల్లో కొందరికి తెలియవని అన్నారు.

‘బాహుబలి’ సినిమాకు ముందు ముంబయిలో ఉంటున్న తన స్నేహితుడిని కలిసిన రానా.. అతడు మాట్లాడిన మాటలకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.  ‘‘బాహుబలి సినిమా షూటింగ్‌ సమయంలో నేను ముంబయి వెళ్లాను. అతడితో మా సినిమా గురించి చెప్పాను. ప్రధాన పాత్రలో ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్నాడని చెప్పగానే, అతడు ప్రభాస్‌ ఎవరో తెలియదని చెప్పాడు. నాకు ఎలా వివరించాలో అర్థం కాలేదు. గతంలో ప్రభాస్‌ నటించిన సినిమాల పేర్లు చెబితే వాటిని చూడలేదని చెప్పాడు. తనకు తెలుగులో తెలిసింది ఒక్క హీరోనే అని.. ‘చిన్ను భర్త మాత్రమే తెలుసు’ అని అతడు చెప్పాడు. చిన్ను ఎవరు అని అడిగితే నమ్రత శిరోద్కర్‌ అని చెప్పాడు. వాళ్లు మహేశ్‌ బాబు (Mahesh Babu)ను కూడా అలా గుర్తుపెట్టుకున్నారా.. అని నేను ఆశ్చర్యపోయాను. నాలుగు సంవత్సరాలు వేచి చూడండి మా హీరోలందరి గురించి మీకే తెలుస్తుంది’’ అని అతడితో చెప్పినట్లు రానా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని