Rashmi: ఇలాంటి వార్తలను ప్రోత్సహించకండి: ‘గుంటూరు కారం’ ఛాన్స్‌ పోస్ట్‌పై రష్మి

తాను ‘గుంటూరు కారం’ సినిమా అవకాశం తిరస్కరించాననే వార్తలపై రష్మి స్పందించారు. 

Published : 13 Feb 2024 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) తెరకెక్కించిన మూడో చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).  సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లోకి వచ్చింది. అందులోని పలు డైలాగ్స్‌, పాటల క్లిప్పింగ్స్‌ను అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆనందిస్తున్నారు. మరోవైపు, కొన్ని సినీ వెబ్‌ పోర్టల్స్‌.. ఈ సినిమాలోని ఓ పాట కోసం చిత్రబృందం ముందుగా వ్యాఖ్యాత, నటి రష్మిని సంప్రదించిందని, ఆమె నటించేందుకు తిరస్కరించారని పోస్ట్‌లు పెట్టాయి. ఆ వార్తలపై రష్మి(Rashmi Gautam) స్పందించారు. ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా వాటిని ఖండించారు. ఆ మూవీ టీమ్‌ అసలు తనను సంప్రదించలేదన్నారు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ తనపై నెగిటివిటీని తీసుకొచ్చే అవకాశముందని, వాటిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. సదరు పోర్టల్స్‌ చెప్పిన పాట మరేదో కాదు.. ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti).

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌లో నటించిన పూర్ణను రష్మి ప్రశంసించారు. ఆమె తప్ప ఇంకెవరూ అంత బాగా చేయలేరని కితాబిచ్చారు. ఈ ప్రత్యేక గీతంలో ‘రాజమండ్రి రాగ మంజరి..’, ‘ఏం రసిక రాజువో మరి’ లైన్స్‌కు పూర్ణ, మిగిలిన పోర్షన్‌కు మహేశ్‌బాబు- శ్రీలీల డ్యాన్స్‌ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, జయరామ్‌, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మహేశ్‌.. రమణ పాత్రలో అభిమానుల్ని అలరించారు. 

ఇదీ కథ: వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌ బాబు). చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోవ‌డంతో ర‌మ‌ణ గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రీ రావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు. వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు. వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డుగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి.. ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తాడు. వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. త‌ల్లిని ఎంతో ప్రేమించే ర‌మ‌ణ.. ఆ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టాడా? ఇంత‌కీ అందులో ఏముంది? త‌న త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? క‌న్న కొడుకుని వ‌సుంధ‌ర ఎందుకు వ‌దిలిపెట్టింది? అన్నదే మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని