Salaar: ఆ రికార్డు ప్రభాస్‌ సినిమాలకు మాత్రమే సాధ్యం.. ‘సలార్’ నిర్మాత ఆసక్తికర కామెంట్స్‌

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) నటించిన సినిమా ‘సలార్’ (Salaar). ఈ చిత్ర నిర్మాత ప్రభాస్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Published : 12 Dec 2023 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్‌ ప్రియులంతా ఎంతో ఎదురుచూస్తోన్న సినిమా ‘సలార్‌’ (Salaar). డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘సలార్‌’ విడుదల తేదీ వెనుక జ్యోతిష్య కారణమేమైనా ఉందా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ అవునన్నారు. ‘‘మా నమ్మకాన్ని బట్టి విడుదల తేదీలను ప్రకటిస్తాం. గత 12 ఏళ్లుగా ఒకే పద్ధతిలో సినిమాలు రిలీజ్‌ చేస్తున్నాం. ‘సలార్’ రిలీజ్‌ సమయంలోనే ‘డంకీ’, ‘అక్వామ్యాన్’ లాంటి సినిమాలు ఉన్నా మేము మాత్రం విడుదల తేదీని మార్చుకోలేదు. సంక్రాంతికి విడుదల చేద్దామంటే ఆ తేదీల్లో తెలుగు, తమిళంలో చాలా కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. అందుకే డిసెంబర్‌ 22న ఖరారు చేశాం. వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ పనులు పూర్తి కాని కారణంగా సెప్టెంబర్‌ 28న విడుదల చేయలేకపోయాం. ఇక ప్రభాస్‌ నటించిన సినిమాలు కొన్ని అనుకున్నస్థాయిలో అలరించలేకపోయాయి. ఒక నిర్మాతగా నేను అలాంటి వాటిని పట్టించుకోను. ఒక హీరో సక్సెస్‌ స్టోరీ ఆధారంగా సినిమాలు తీస్తా. ‘సలార్‌’ బ్లాక్‌ బస్టర్ అవుతుందని మాకు పూర్తి నమ్మకముంది. ప్రభాస్‌ సినిమాలు తొలిరోజు కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తాయి. ఆయన సినిమాలకు తప్ప ఆ స్థాయి ఓపెనింగ్స్ ఎవరి సినిమాలకు సాధ్యంకావు’’ అని చెప్పారు. ఇక ‘సలార్‌’ రెండో భాగం కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ‘కేజీఎఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), యశ్ ఇద్దరూ బిజీగా ఉన్నారని.. వాళ్ల ప్రాజెక్ట్‌లు ఒక కొలిక్కి వచ్చాక ‘కేజీఎఫ్-3’ మొదలుపెడతామన్నారు.

‘డంకీ’ రిలీజ్‌కు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన షారుక్‌..

‘సలార్‌’ విడుదల తేదీ దగ్గరపడుతున్నా చిత్రబృందం ఇంకా ప్రమోషన్స్‌ మొదలు పెట్టకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రిలీజ్‌కు మరో 10 రోజులే ఉన్నా.. ఇప్పటి వరకు పాటలు, ప్రీరిలీజ్ ఈవెంట్‌ తేదీలు గానీ పంచుకోలేదు. ప్రమోషన్స్‌ లేకుండా సినిమాను డైరెక్ట్‌గా విడుదల చేయాలని భావిస్తున్నారని కూడా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్‌ బోర్డు దీనికి ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని