Samantha: మయోసైటిస్‌కు ఐవీఐజీ థెరపీ తీసుకుంటున్న సామ్‌.. ఆరోగ్యంపై లేటెస్ట్‌ అప్‌డేట్‌

Samantha: మయోసైటిస్‌ నుంచి కోలుకునేందుకు సమంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు వ్యాయామాలను సైతం చేస్తున్నారు.

Updated : 11 Feb 2023 17:56 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు/వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. మయోసైటిస్‌కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ (ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబలిన్‌ థెరపీ) సెషన్‌కు హాజరైనట్లు చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఫొటోను షేర్‌ చేస్తూ ‘న్యూ నార్మల్‌’ అని పేర్కొన్నారు. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ను సమర్థంగా పనిచేయించడంతో పాటు, ఇతర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. దీని కోసం 2 నుంచి 4 గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చికిత్సను సమంత ఇంట్లోనే తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటున్నా వ్యాయామాన్ని మాత్రం సామ్‌ నిర్లక్ష్యం చేయడం లేదు. ఇంట్లోనే జిమ్‌ చేస్తున్న వీడియోను కూడా సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేశారు.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే, ఈ 17న విడుదల కావాల్సిన ‘శాకుంతలం’ వాయిదా పడింది. ఏప్రిల్‌ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. గుణ శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు, విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె ‘ఖుషి’లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. వరుణ్‌ ధావన్‌తో కలిసి సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌లో సామ్‌ నటిస్తున్నారు.  రుస్సో బ్రదర్స్‌ దీన్ని నిర్మిస్తుండగా, రాజ్‌ అండ్‌ డీకే భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి, తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ముంబయి వెళ్లిన సమంత ‘సిటాడెల్‌’ చిత్రీకరణలో పాల్గొన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని