Sanjay Dutt: గాయాలైనా.. షూటింగ్‌లో పాల్గొన్న సంజయ్‌దత్‌?

నటుడు సంజయ్‌దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరిగిందని సమాచారం.

Published : 15 Aug 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ (Sanjay Dutt)కు గాయాలైనట్లు తెలుస్తోంది. తాను కీలక పాత్ర పోషిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రీకరణలో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. తలకు రెండు కుట్లు పడ్డాయని, దాన్ని లెక్కచేయకుండా సంజయ్‌దత్‌ తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారని చిత్ర బృందం చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. రామ్‌ (Ram Pothineni) హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కిస్తున్న చిత్రమే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). ఇందులో సంజయ్‌దత్‌.. బిగ్‌ బుల్‌ అనే నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ థాయ్‌లాండ్‌లో ఇటీవల ప్రారంభమైంది. అక్కడే ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటుడు ఉపేంద్రపై కేసు నమోదు

‘కేడీ’ అనే సినిమా చిత్రీకరణలోనూ కొన్ని నెలల కిత్రం సంజయ్‌ గాయపడ్డారు. యాక్షన్‌ సన్నివేశాలు షూట్‌ చేస్తున్న సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు ధ్రువ సర్జా హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. లవ్‌, యాక్షన్‌ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్‌ దత్‌. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడిన ఆయన.. దాని నుంచి కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. కన్నడలో తెరకెక్కిన ‘కేజీయఫ్‌ 2’ ఇటీవల కాలంలో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అధీరగా ఆయన నటన అందరినీ కట్టి పడేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని