Shruti Haasan: అది నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి..: శ్రుతి హాసన్‌

కమల్‌ హాసన్‌ కుమార్తెగా సినీ పరిశ్రమలోకి వచ్చిన శ్రుతి హాసన్(Shruti Haasan)‌. నటిగానే కాకుండా సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె గాయనిగా తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపింది. 

Published : 02 Feb 2023 15:08 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది వరస సినిమాలతో అలరించింది శ్రుతి హాసన్‌(Shruti Haasan). అగ్ర హీరోల సరసన నటించిన వీరసింహారెడ్డి(Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) రెండు సినిమాలు విజయం సాధించడంతో ఫుల్‌ ఖుషీలో ఉంది ఈ అమ్మడు. ఇటీవల ఈ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఒక నటికి తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం.. రెండూ సూపర్‌ హిట్‌గా నిలవడం చాలా అరుదుగా జరుగుతుంటుందని తెలిపింది.

టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోల సినిమాలతో అలరిస్తోంది. నటిగానే కాకుండా గాయని గానూ ప్రేక్షకులకు చేరువైంది. ఇక బాలీవుడ్‌లో తను నటించిన తొలి సినిమా ‘లక్‌’ విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘నేను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు నా సింగింగ్‌ గురించి ఎక్కడా మాట్లాడవద్దని చెప్పేవారు. అలా చేస్తే సినిమాలపై ప్రభావం పడుతుందని అనేవారు. నేను రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాను. నేను మొదటిసారి మైకు ముందు పాడిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆరోజు మా నాన్న నేనెలా పాడతానో అని చాలా భయపడ్డారు. ఇక కొవిడ్‌ సమయంలో నేను నా కళను ఎంతో మెరుగుపరచుకున్నాను. ఆ తర్వాత స్టేజ్‌ షోల్లో పాల్గొని ప్రేక్షకులు స్పందనను ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా అనిపించింది. పాట రాయగలగడం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి. మిగతా ప్రపంచంతో దానిని పంచుకోగలగడం అదనపు వరం’’ అని తెలిపింది శ్రుతి.

ప్రస్తుతం శ్రుతి హాసన్‌ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘సలార్’ ‌(Salaar) సినిమాలో నటిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని