Bedurulanka 2012: యుగాంతం నేపథ్యం.. మూఢవిశ్వాసాలపై వ్యంగ్యాస్త్రం.. ‘బెదురులంక’ విశేషాలివీ

కార్తికేయ గుమ్మకొండ హీరోగా దర్శకుడు క్లాక్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని సంగతులు..

Published : 24 Aug 2023 12:15 IST

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా తెరకెక్కిన కామెడీ- డ్రామా చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘బెదురులంక’ గురించి కొన్ని విశేషాలు..

  • యుగాంతం నేపథ్యంలో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిన హాలీవుడ్‌ చిత్రం ‘2012’. ఈ సినిమా, అకిరా కురసోవా ‘సెవెన్‌ సమురాయ్‌’లోని ‘రేపు ఉండదని అన్నప్పుడు.. సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం’ అనే డైలాగ్‌ స్ఫూర్తితో నూతన దర్శకుడు క్లాక్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు (Bedurulanka 2012).
  • కల్పితమైన ఓ లంక గ్రామం నేపథ్యంలో సాగే చిత్రమిది. మూఢవిశ్వాసాలపై ఓ వ్యంగ్యాస్త్రంలా, అంతర్లీనంగా ఓ సందేశంతో కూడిన కథతో రూపొందించారు. అందుకే ‘బెదురులంక’ అనే పేరు పెట్టారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అన్నీ తెలిసిపోతుంటాయి. కానీ, పాత్రలకే ఏమీ తెలియదట. అదే ఈ సినిమాలో ప్రత్యేకత అని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
  • కార్తికేయ నటించిన 10వ చిత్రమిది. ఈ సినిమాలో ఆయన శివ అనే పాత్రలో కనిపిస్తారు. సన్నివేశం డిమాండ్‌ మేరకు శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి అసలు పేరు)గా ఓ డైలాగ్‌ చెబుతారు. కార్తికేయ వ్యక్తిగతంగా చిరంజీవి అభిమాని అనే సంగతి తెలిసిందే. సినిమాలో ఉద్దేశపూర్వకంగా ఆయన పేరు వాడుకోలేదని కార్తికేయ చెప్పారు (Bedurulanka 2012 Release on August 25th).
  • శివ ఓ స్వేచ్ఛా జీవి. మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. గ్రాఫిక్స్‌ డిజైనర్‌ జాబ్‌ మానేసి సిటీ నుంచి బెదురులంకకు వస్తాడు. యుగాంతం వల్ల ఆ ఊరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్రజల్లోని అమాయకత్వానికి, భయానికి.. మతం రంగు పులిమి కొందరు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏమైందన్నది ఈ కథలో ఆసక్తికరం.
  • ‘డీజే టిల్లు’లో రాధికగా నటించి యువ హృదయాలు దోచుకున్న నటి నేహాశెట్టి. ‘బెదురులంక’లో ఆమె పల్లెటూరి అమ్మాయి చిత్రగా కనిపించనున్నారు. నేహా నటించిన 5వ తెలుగు సినిమా ఇది. ప్రచార చిత్రాలు, పాటల్లోని కార్తికేయ- నేహాశెట్టిల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  • ఈ సినిమాలో అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఎల్‌.బి. శ్రీరామ్‌, గోపరాజు రమణ, గెటప్‌ శ్రీను, సత్య, ఆటో రామ్‌ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించి, ప్రేక్షకులకు నవ్వులు పంచనున్నారు. గోదావరి జిల్లాల్లోని పల్లెటూళ్లలో ఈ సినిమాని చిత్రీకరించారు.
  • మణిశర్మ సంగీతం, సాయి ప్రకాశ్‌ కెమెరా పనితనం సినిమాకి ప్రధాన బలమని నిర్మాత రవీంద్ర బెనర్జీ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాలో ఓ పాటను సగం రాశారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో మిగిలిన భాగాన్ని చైతన్యప్రసాద్‌ పూర్తి చేశారు (Bedurulanka 2012 Release Date).
  • సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification) ఈ చిత్రానికి యు/ఎ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 28 నిమిషాలు. ఈ సినిమా బడ్జెట్‌ సుమారు రూ. 50 కోట్లని సమాచారం.
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పెయిడ్‌ ప్రీమియర్స్‌ (Bedurulanka 2012 Paid Premieres)ను ఆగస్టు 24న ప్రదర్శించనున్నారు. ఏఎంబీ సినిమాస్‌(హైదరాబాద్‌), శ్రీ వేంకటేశ్వర (వైజాగ్‌), లక్ష్మీ (కాకినాడ), క్యాపిటల్‌ సినిమాస్‌ (విజయవాడ), నాజ్‌ సినిమాస్‌ (గుంటూరు)లో పెయిడ్‌ ప్రీమియర్స్‌ను వేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు