Srimanthudu Copyright Dispute: ‘శ్రీమంతుడు’ కథపై వివాదం.. దర్శకుడు కొరటాల శివకు సుప్రీంలో చుక్కెదురు

Srimanthudu: శ్రీమంతుడు సినిమా కథ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా, దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది.

Updated : 29 Jan 2024 17:40 IST

న్యూదిల్లీ: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శ్రీమంతుడు’ (Srimanthudu). 2015లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ చిత్ర కథ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘శ్రీమంతుడు’ స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

‘శ్రీమంతుడు’ కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్‌ చంద్ర సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ.. రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో శివ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని..  హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా’ అని న్యాయవాది నిరంజన్‌రెడ్డిని కోర్టు ప్రశ్నించగా, తామే పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది.

ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే: వేల కోట్ల సంపద కలిగిన వ్యాపారవేత్త రవికాంత్‌ (జగపతిబాబు). అతడి కొడుకు హర్షవర్ధన్‌ (మహేశ్‌బాబు) అనుకోని పరిస్థితుల్లో తన తండ్రి పుట్టి పెరిగిన దేవరకోట గ్రామం, అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుంటాడు. దీంతో అన్నింటినీ వదులుకొని ఆ ఊరికి వెళ్తాడు. హర్ష దేవరకోట వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరిని ఎలా బాగు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని